సీతంపేట: తిత్లీ తుఫాన్ ప్రభావంతో బాగా నష్టపోయామని పలువురు గిరిజనులు పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీతంపేట మండలంలోని వజ్జాయిగూడ, పాతవజ్జాయిగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పూరిళ్లు, రేకిళ్లు ఎగిరిపోయాయని, జీడి,మామిడి, అరటి తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, రహదారి లేక అనేక అవస్థలు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. గిరిజనోత్పత్తులను మార్కెట్‌కు తీసుకువెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని, కొద్దిరోజుల కిందట ప్రిన్సిపల్ సెక్రటరీ తమ గ్రామాన్ని సందర్శించి రహదారి నిర్మిస్తామని చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే గడువును పెంచాలన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం పాతలోవగూడ గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్.లక్ష్మి, మండల వైఎస్సార్‌సీపీ మహిళా కన్వీనర్ ఆరిక కళావతి, పీసా చట్టం ఉపాధ్యక్షుడు నిమ్మక సోమయ్య, పార్టీ నేతలు గణేష్, చంద్రశేఖర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment