
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించారు. తమ నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. సోమవారం పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కామ్‌లో 150 కోట్ల అవినీతికి పాల్పడినందుకే టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని, నేరానికి కులాలు, మతాలు ఉండవని అన్నారు. మహిళ అధికారిని దుర్భాషలాడటంతో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టారని తెలిపారు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బీసీ నేతను హత్యచేసిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. చట్టం అందరికి ఒకటేనని ఓసీ, బీసీలకు ప్రత్యేకంగా ఉండదని పేర్కొన్నారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు తప్పు చేసారు కాబట్టే అరెస్ట్ చేశారని, అచ్చన్న, అయ్యన్న, కొల్లు స్థానంలో నారా లోకేష్ చౌదరి ఉన్నా అరెస్ట్ చేసేవాళ్లమని స్పష్టం చేశారు. కాగా, అధికారంలో ఉండగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. ఆయన అధికారంలో ఉండగా, న్యాయం కోసం వెళితే తోలుతీస్తా, తోకలు కత్తిరిస్తా అని బెదిరించే వారని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. బీసీలను అన్నివిధాలా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని తెలిపారు. బీసీలను ఉప ముఖ్యమంత్రులను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పార్థసారథి పేర్కొన్నారు. (చదవండి: మండలిని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు)
Comments
Please login to add a commentAdd a comment