
సాక్షి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనతో పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వైఎస్సార్ సీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్ 10వ వర్ధంతి సందర్భంగా ఆసిల్ మెట్ట జంక్షన్‌లోని మహానేత విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమనసంక్షేమ సంఘ గౌరవాధ్యక్షులు సత్తి నాగేశ్వరరెడ్డి, అధ్యక్షులు ఎన్. వివేకానందరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి , వేమన సంఘం ప్రధాన కార్యదర్శి సత్తి రామకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బోరా కుమార్ రెడ్డి, సంఘ నాయకులు సుబ్బారెడ్డి, కర్రి రామారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ పేద ప్రజలకి అండగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు నెలల తన పాలనలోనే ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకుండానే లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు.