అక్కడ ఖాళీ.. అందుకే.. ఇక్కడ మోళీ
తెలుగుదేశం నేతల గోబెల్స్ ప్రచారంపై వైఎస్సార్‌సీపీ నాయకుల ఆగ్రహం
టీఆర్‌ఎస్ దెబ్బకు దిమ్మతిరిగే.. ఈ కుతంత్రమంటూ మండిపాటు
తమ ఎమ్మెల్యేలు పార్టీ మారతారంటున్న తప్పుడు కథనాలకు ఖండన
కొన్ని జిల్లాల్లో విపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారంటూ తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోందని, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ గోబెల్స్ ప్రచారానికి టీడీపీ నేతలు ఒడిగడుతున్నారని వారు మండిపడ్డారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తల బొప్పి కట్టడం.. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు క్యూ కడుతూండడంతో దిమ్మ తిరిగిన తెలుగుదేశం పార్టీ.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. ఆంధ్రాలో తమ ఎమ్మెల్యేలపై అసత్య ప్రచారానికి ఒడిగడుతోందని.. వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారానికి పాల్పడుతూ.. మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వలస పోతూంటే ఆపలేకపోతున్న ఆ పార్టీ నేతలు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విపక్ష ఎమ్మెల్యేలు కొందరు ‘దేశం’లో చేరుతున్నారంటూ చేస్తున్న దుష్ర్పచారాన్ని.. జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులంతా ముక్తకంఠంతో ఖండించారు. కష్టమైనా, నష్టమైనా వైఎస్సార్‌సీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడూ తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటారని, అధికార పార్టీ దమననీతిని ప్రయోగిస్తే ఎదుర్కొంటారే తప్ప వెన్ను చూపబోరని స్పష్టం చేశారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే దుష్ర్పచారం
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం, తెలంగాణలో ఎదురైన ఘోర పరాభవంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరతారంటూ అధికార పార్టీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ మైండ్‌గేమ్‌ను టీడీపీ మొదలెట్టింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులపై దుష్ర్పచారం చేస్తున్నారు. మా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిత్యం ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతున్న మా పార్టీకి ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది. ఇప్పటికైనా టీడీపీ నాయకులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు.
- జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే
అక్కడి వలసలు ఆపలేకే ఇక్కడ దుష్ర్పచారం
తెలంగాణలో ఇప్పటికే 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మిగిలిన ఐదుగురూ కూడా అదే పార్టీవైపు చూడడంతో దిమ్మతిరిగిన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో వలసలకు అడ్డుకట్ట వేయలేకపోయినా.. ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారంటూ తనకు అనుకూల పత్రికల ద్వారా మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కాకుండా టీడీపీ ఇన్‌చార్జ్‌లకు నిధులిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఒకప్పుడు మాల, మాదిగలను, ప్రస్తుతం బీసీలు, కాపులను విభజించి పాలిస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి నూకలు చెల్లే రోజులు దగ్గర పడుతున్నాయి. మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై మాకందరికీ సంపూర్ణ విశ్వాసం ఉంది.
- చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట
ఒక్క కార్యకర్త కూడా టీడీపీలో చేరరు
మా వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో చేరరు. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కూడా టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలకు తెర లేపారు. ఇది సిగ్గుచేటు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ పార్టీకి బద్ధులై పని చేస్తారు. పార్టీ వెంటే క్రమశిక్షణతో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ఏ ఒక్కరూ నమ్మే స్థితిలో లేరు.
- వంతల రాజేశ్వరి, ఎమ్మెల్యే, రంపచోడవరం
అది టీడీపీ మైండ్‌గేమ్
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు టీఆర్‌ఎస్‌లోకి ప్రవాహంలా వెళ్లిపోతూండటంతో చంద్రబాబు అండ్ కో నేతలకు మతి భ్రమించింది. టీడీపీ కోసం పని చేస్తున్న ‘ఎల్లో’ మీడియా సహాయంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మైండ్‌గేమ్ ఆడుతున్నారు. నేను ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. జగనన్నకు విశ్వాసపాత్రుడుగా ఉంటా. టీడీపీలో ఎవరైనా చేరడమంటే అరాచకాలకు మద్దతు ఇవ్వడమే. భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే. తుని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా.
- దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని