
అబద్ధాల బాబు
రైతుల, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ పేరుతో దగా
ఏడాదిలోపే ప్రజల నమ్మకం కోల్పోయిన బాబు
తణుకు దీక్షలో ధ్వజమెత్తిన జిల్లా నేతలు
రెండవరోజు జగన్‌ను కలిసిన పలువురు నాయకులు
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా హామీలు గుప్పించి, తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రజలను వంచించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం తణుకులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ప్రజలనుద్దేశించి పలువురు నేతలు ప్రసంగించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజాద్‌బాష, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తదితరులు ప్రసంగిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేవలం అధికారం కోసమే అమలుకు సాధ్యంగానీ హామీలను గుప్పించారని వారు ధ్వజమెత్తారు.
ఈ నేపధ్యంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ సర్కార్‌మెడలు వంచేందుకే దీక్ష చేపట్టారని వారు ప్రశంసించారు. ఊహించని రీతిలో దీక్షకు జనం రావడం చూస్తే జగన్‌పై ప్రజలకు ఉన్న అభిమానం ఇట్టే అర్థమవుతోందన్నారు. కాగా వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్షకు జిల్లా నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు వెళ్లి సంఘీభావం తెలిపారు.