సీఎం చంద్రబాబు అసమర్థత వల్ల విద్యార్థుల్లో అయోమయం నెలకొందని, ఆంధ్ర విద్యార్థులు ఎక్కడ చదువుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు.
చెవిరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, జలీల్‌ఖాన్‌లు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు అసమర్థత వల్ల విద్యార్థుల్లో అయోమయం నెలకొందని, ఆంధ్ర విద్యార్థులు ఎక్కడ చదువుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం సహచర ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జలీల్‌ఖాన్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.
దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నీరుగార్చే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో వీరంతా ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముందని చెప్పారు. విదేశీ పర్యటనలు, ప్రచారంపై ఉన్న మోజు విద్యార్థుల భవిష్యత్తుపట్ల కనబరచాలని హితవు పలికారు. హుద్‌హుద్ సాయం పంపిణీ చేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇళ్ళల్లో, గోడౌన్లలో దాచుకున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసిన విష యం వాస్తవమో కాదో చెప్పాలన్నారు. తన నియోజకవర్గంలో మూడేళ్లుగా పంటలు ఎండిపోతున్నాయని కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు.