
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో వైస్సార్ సీపీ ఎంపీలు ప్రజాసమస్యలపై గళమెత్తారు. ఏపీకి కేంద్రం తరపున నిధులు, కేటాయింపులు అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు.
ఖర్చు రూ. 6,598 కోట్లు... ఇచ్చింది రూ. 4,343 కోట్లు
పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2017 జూలై వరకూ రూ.6,598 కోట్లు వ్యయం చేయగా కేంద్రం రూ.4,343 కోట్లను విడుదల చేసిందని కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014 మార్చి 31వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.5135.87 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం వాటాగా రూ.562.47 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు జరగటంపై విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మేఘవాల్ సమాధానమిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించిన సమాచారం మేరకు అలాంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కుటుంబాలు మైనర్ పిల్లలను మేజర్లుగా చూపి పరిహారం పొందేందుకు ప్రయత్నించాయన్నారు. ఈ కేసులను విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందన్నారు.
విశాఖ జిల్లాలో ఉపాధి వేతనాలు ఆగలేదు
విశాఖ జిల్లాలోని 13 మండలాల్లో ఉపాధి హామీ కింద చెల్లించాల్సిన వేతనాలు 3 నెలలుగా పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోవటం కేంద్రం దృష్టికి వచ్చిందా? అని విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ సమాధానమిస్తూ వేతనాల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన వారు పోస్టాఫీసుకు వచ్చిన వెంటనే బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.
వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి : ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆయన సోమవారం లోక్‌సభలో నిబంధన–377 కింద ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ వంటి భారీ ప్లాంట్లను గమనిస్తే ముడి ఇనుప ఖనిజాన్ని దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. అయినప్పటికీ అవి లాభాల బాటలో నడుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాతోపాటు చుట్టుపక్కల ముడి ఇనుప ఖనిజం నిల్వలు విస్తారంగా ఉండగా, లాభదాయకతపై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి?’’ అని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
శనగ పంటకు బీమా గడువు పొడిగించండి
రబీలో సాగు చేసిన శనగ పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ అశిష్‌కుమార్ బుటానీని కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆయన బుటానీని కలిసి కోరారు.
రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు వద్దు
లోక్‌సభలో ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్రం సమాధానం
చిన్నారులు రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు మోయకుండా చూడాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) గతేడాది సెప్టెంబరులో సర్క్యులర్ జారీ చేసినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సభలో సమాధానం ఇచ్చారు. ఒకటి, రెండు తరగతులకు కేవలం రెండు పుస్తకాలను(భాష, గణితం) మాత్రమే ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు చేసిందని, అలాగే మూడు, నాలుగు, ఐదో తరగతులకు భాష, పర్యావరణ అధ్యయనం, గణితం వంటి మూడు పుస్తకాలనే సిఫార్సు చేసిందన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నాం
దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నట్టు రాతపూర్వకంగా తెలిపారు. సోమవారం ఆయన లోక్‌సభలో సభ్యుడు జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
స్టీల్ ప్లాంట్‌పై టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇవ్వలేదు
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన సమీకృత స్టీల్ ప్లాంట్‌పై అధ్యయనం చేస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి తెలిపారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, ఎం.మురళీమోహన్ సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే జాతీయ విద్యాసంస్థలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు ఏపీలో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థలన్నీ ప్రారంభమయ్యాయని, అయితే ఇవన్నీ ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఆయా జాతీయ సంస్థల ఏర్పాటులో పురోగతి, ఇంకా శాశ్వత ప్రాంగణాల్లోకి రాకపోవడానికి గల కారణాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. సెంట్రల్ వర్సిటీ, ట్రైబల్ వర్సిటీలు ఇంకా ప్రారంభం కాలేదని, పార్లమెంటులో సంబంధిత బిల్లులు ఆమోదం పొందిన మీదట ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ రెండు వర్సిటీలకు 2017–18 బడ్జెట్‌లో రూ.8 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
‘పోలవరం’ అంచనాలపై సీడబ్ల్యూసీ స్పష్టత కోరింది
పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2013–14 ధరల సూచీ ప్రకారం రూ.58,319.06 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించి స్పష్టత కోరిందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సీడబ్ల్యూసీ చేసిన పరిశీలన మేరకు తగిన మార్పులు చేసిన పక్షంలో ఆమోదం లభిస్తుందని తెలిపారు.
భూములు ఇస్తే సీబీ ఇండస్ట్రియల్ కారిడార్
చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టును కేంద్రం 2016 డిసెంబర్‌లో ఆమోదించిందని, ఏపీకి సంబంధించిన ప్రాజెక్టు అభివృద్ధి పనులు రాష్ట్రప్రభుత్వం భూములు అప్పగిస్తే ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఎంపీ అవినాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment