
సాక్షి, విజయనగరం పూల్‌బాగ్: తలదాచుకోడానికి నిలువ నీడలేదు. ఇల్లు నిర్మించుకోడానికి సెంటు భూమి లేదు. ఏరోజు సంపాదన ఆ రోజు గంజినీళ్లకైనా సరిపోదు.. ఇదంతా 2004 సంవత్సరానికి రాష్ట్రంలో పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బీదబిక్కీ దుర్భర దుస్థితి కళ్లారా చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే అర్హులకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పలేదు. మడప తిప్పలేదు. అధికారంలోకి రాగానే లక్షలాది ఇళ్లు మంజూరు చేశారు. పార్టీలకతీతంగా అర్హులకు ఇళ్లు నిర్మించి అందజేశారు. అక్షరాలా అది సువర్ణయుగం.
ఆ మహానుభావుడి అర్ధాంతర మరణంతో రాష్ట్రంలో చీకట్లు ముసురుకున్నాయి. అనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇళ్లు మంజూరు చేసింది. కానీ అవి దక్కించుకున్నది తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు మాత్రమే. ఎవరికైనా ఇళ్లు కావాలంటే జన్మభూమి కమిటీలకు భారీగా ముట్టజెప్పాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో ప్రజా సంకల్పయాత్ర నిర్వహించిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ గూడు లేని పేదల కష్టాలను కళ్లారా చూశారు. అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రకటించారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని నవరత్నాల్లో పొందుపరిచారు. ఇంటిపై రుణం పొందే అవకాశం కూడా కల్పిస్తానన్నారు. ఆయన హామీతో ఆనందభరితులైన పేదల అంతరంగమిది.
అన్ని వర్గాలకు న్యాయం
జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు అందుతాయి. జగన్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
– మహంతి శ్రీరవి, 3వ వార్డు, పూల్‌బాగ్ కాలనీ.
25 లక్షల కుటుంబాలకు మేలు
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తానని ప్రకటించడం శుభపరిణామం. వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో మాత్రమే అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేరింది.
– రామేశ్వరపు అప్పారావు, డకిని వీధి, 37 వవార్డు,
ఆలోచించి ఓటేయాలి
జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదకు పక్కా ఇళ్లు నిర్మిస్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దయ ఉన్నవారికే ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలి.
– ఉప్పూడి వెంకటరమణ, 24వ వార్డు, వీటీ అగ్రహారం
రుణ మొత్తం పెంపు
వైఎస్ జగన్ ప్రకటించిన పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మాణ వ్యయం, తర్వాత ఆ ఇంటిపై తీసుకునే రుణ మొత్తంలో కూడా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. దీంతో పేదల ఇంటి నిర్మాణ కష్టాలు తీరుతాయి.
– పండూరి శ్రీ రామమూర్తి, కాటవీధి కాలనీ
అప్పు అవసరం లేదు
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణానికి ఇచ్చే నగదు చాలక అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ అధికారంలోకి వస్తే పేదలు ఇల్లు కట్టుకునేందుకు అప్పు చేయాల్సిన అవసరం లేదు.
– రామేశ్వరపు కుమారి, డకిని వీధి, 37వ వార్డు
మహిళల పేరిట రిజిస్ట్రేషన్
ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా.. వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామనడం శుభపరిణామం. అయిదేళ్లలో 25 లక్షల ఇళ్లు కేటాయిస్తే గ్రామాల్లో ఇక పూరిళ్లే ఉండవు.
– ఆలమూరి చంద్రకళ, గాజులరేగ
Comments
Please login to add a commentAdd a comment