జిల్లాలో ఆదివారం జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయకేతం ఎగురవేసింది. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా ఓటర్లు వైఎస్‌ఆర్‌సీపీ వైపే మొగ్గు చూపారు.
సాక్షి, కడప : సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ హవా కొనసాగుతోంది. కమలాపురం, బద్వేలు, రాయచోటి నియోజకవర్గాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం రోజు 20 సొసైటీలకు ఎన్నికలు జరగ్గా, ఇందులో 17 సొసైటీల్లో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి కైవసం చేసుకోవడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇందులో కూడా చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే అక్కడ ఆధిక్యతను ప్రదర్శించగలిగారు. సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, పోలీసుసిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టారు.
కే.అగ్రహారం సొసైటీలో....
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఇక్కడ విచ్చలవిడిగా మంచినీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు చేశారు. తెలుగుదేశం నేత రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, డీఎల్ సమీప బంధువు గంగవరం ఆదినారాయణరెడ్డిలు శనివారం సంయుక్తంగా ప్రచారంచేశారు. ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు టీడీపీ నాయకులు తమవంతు సహకారం అందించారు. ఇలాగే 12వ వార్డుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి గంగావతిని గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేశారు. దీంతోపాటు డబ్బులుసైతం అన్ని వార్డుల్లో విపరీతంగా పంపిణీ చేశారు. నందలూరు సొసైటీలో సైతం టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కావడం గమనార్హం.
వైఎస్సార్ సీపీ గెలుపొందిన
సొసైటీలు ఇవే!
బి.కోడూరులో వైఎస్సార్ సీపీ 13 డెరైక్టర్ స్థానాలు గెలుచుకోగా, అధ్యక్షునిగా ఒ.ప్రభాకర్‌రెడ్డి ఎన్నిక కానున్నారు. చెన్నకేశంపల్లెసొసైటీలో వైఎస్సార్‌సీపీ 13 డెరైక్టర్ స్థానాలను గెలుచుకుంది. అధ్యక్షునిగా పోలిరెడ్డి ఎన్నిక కానున్నారు. పెనగలూరులో వైఎస్సార్ సీపీ 12, కాంగ్రెస్ 1 డెరైక్టర్ స్థానాలను గెలుచుకున్నాయి. కొండూరు అజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షునిగా ఎన్నిక కానున్నారు. మన్నూరు సొసైటీలో కాంగ్రెస్ 4, వైఎస్సార్ సీపీ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ 1 డెరైక్టర్ స్థానాలను గెలుచుకున్నారు. ఇక్కడ అధ్యక్ష అభ్యర్థి ఖరారు కావాల్సిఉంది. అనంతయ్యగారిపల్లెలో వైఎస్సార్ సీపీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షునిగా ఎంపిక కానున్నారు. అనంతసముద్రంలో వైఎస్సార్ సీపీ 13 డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవం కాగా, అల్లెం రామిరెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. వీరబల్లిలో వైఎస్సార్ సీపీ 7, కాంగ్రెస్ 6 డెరైక్టర్‌స్థానాల్లో విజయం సాధించగా, కల్లూరు రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షుడిగాఎంపిక కానున్నారు. మట్లిలో వైఎస్సార్ సీపీ 11, టీడీపీ 1, కాంగ్రెస్ 1 డెరైక్టర్ స్థానాల్లో గెలుపొందారు. రామాంజులరెడ్డి అధ్యక్షుడు కానున్నారు.
నాగిరెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ 12 స్థానాలను కైవసం చేసుకోగా, పల్లవోలు భాస్కర్‌రెడ్డి అధ్యక్షుడు కానున్నారు. యల్లటూరు సొసైటీలో వైఎస్సార్ సీపీ 12స్థానాలు కైవసం చేసుకోగా, కంభం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షునిగా ఎంపిక కానున్నారు. వల్లూరు సొసైటీలో వైఎస్సార్ సీపీ 7, టీడీపీ 5 స్థానాల్లో విజయం సాధించారు. టి.కృష్ణారెడ్డి అధ్యక్షుడు కానున్నారు. దిగువగొట్టివీడులో వైఎస్సార్ సీపీ 9, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించారు. కె.గోవర్దన్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. మద్దిరేవుల సొసైటీలో వైఎస్సార్ సీపీ 8, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందారు.
పోలిరెడ్డి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. కొలిమివాండ్లపల్లెలో వైఎస్సార్ సీపీ 10, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందారు. ఆదినారాయణరెడ్డి అధ్యక్షుడిగాఎంపిక కానున్నారు. గొర్లముదివీడులో వైఎస్సార్‌సీపీ 9, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలుపొందాయి. కె.వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షుడు కానున్నారు. అల్లాడుపల్లె సొసైటీలో వైఎస్సార్ సీపీ 8, టీడీపీ 2, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించారు. అధ్యక్షుడిగా పి.వేమారెడ్డి ఎంపిక కానున్నారు. గోనుమాకులపల్లెలో వైఎస్సార్ సీపీ 11, కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకున్నారు. సొసైటీ అధ్యక్ష అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.
కాంగ్రెస్ గెలిచిన సొసైటీలివే!
నందలూరులో కాంగ్రెస్ 10, టీడీపీ 1, వైఎస్సార్ సీపీ 2 స్థానాల్లో గెలుపొందగా, మేడాభాస్కర్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. కె.అగ్రహారంలో కాంగ్రెస్ 9, వైఎస్సార్ సీపీ 4 స్థానాల్లో గెలుపొందగా, అధ్యక్ష అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. టంగుటూరు సొసైటీలో వైఎస్సార్‌సీపీ 7, కాంగ్రెస్ 5, టీడీపీ 1 స్థానంలో గెలుపొందింది. ఇక్కడ రామచంద్రారెడ్డి సొసైటీ అధ్యక్షునిగా ఎంపిక కానున్నారు. కాగా సోమవారం ఉదయం 9 గంటలకు సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు.
పుత్తాకు శృంగభంగం
కమలాపురం నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్ సీపీ తమ సత్తా చాటుకుంది. ఎన్నికలు జరిగిన నాలుగు సొసైటీలు వల్లూరు, నాగిరెడ్డిపల్లె, ఎల్లటూరు, గోనమాకులపల్లెలో విజయఢంకా మోగించింది. టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టి ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం విశేషం. బద్వేలులో ఎమ్మెల్యే కమలమ్మ కుయుక్తులు పన్నడంతోపాటు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై పోరాడినా బి.కోడూరు, చెన్నకేశంపల్లెలో ఒక్క డెరైక్టర్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయి పరాభవాన్ని మూటగట్టుకున్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్‌రెడ్డి తమ ఆధిక్యతను ప్రదర్శించారు. అక్కడ అన్ని సొసైటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలుపొందారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మనందరెడ్డిలు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల గెలుపులో కీలక పాత్ర పోషించారు.