సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాన్ని వ్యూహత్మకంగా ఎదుర్కోవాలని, వాస్తవాల ఆధారంగానే సమాధానం చెప్పేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని నేతలు నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలోని వైఎస్సార్‌ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలి
ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికీ వాస్తవాలతోనే అధికార పక్షం సమాధానమివ్వాలని, అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం తెప్పించుకుని సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. వ్యవసాయం, వాహన మిత్ర, వైఎస్సార్ నవశకం, రాజధాని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% రిజర్వేషన్లు, మద్యం విధానం–ధరలు, స్పందన, ఇసుక సరఫరా, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు, నాడు–నేడు, రైతు భరోసా, అవినీతి నిర్మూలన వంటి అంశాలు ఉభయ సభల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఏయే అంశాలపై ఎవరు మాట్లాడాలనే దానిపైనా చర్చించారు. వాగ్ధాటి గల ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలించారు. అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 19వ తేదీ వరకూ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి? కార్యకలాపాలు ఏయే అంశాలపై ఉంటాయి? అనేది సమావేశాల ప్రారంభం రోజున జరిగే ఉభయ సభల బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా మండలి) సమావేశంలో నిర్ణయిస్తారు.
9న శాసనసభాపక్ష సమావేశం!
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల ప్రారంభం రోజునే వైఎస్సార్‌ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతిసారి మాదిరిగానే సంప్రదాయికంగా ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. బుధవారం వైఎస్సార్‌ఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి విప్‌లు సామినేని ఉదయభాను, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, ఎం.జగన్‌మోహన్‌రావు, జోగి రమేష్, మల్లాది విష్ణు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment