‘పట్టిసీమ’పై సమరభేరి | YSRCP Samara Bheri on Dispose Polavaram project | Sakshi
Sakshi News home page

‘పట్టిసీమ’పై సమరభేరి

Published Mon, Mar 2 2015 12:01 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

YSRCP Samara Bheri on Dispose Polavaram project

 సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు    14న హోమంతో శ్రీకారం
  ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న జ్యోతుల
  విమానాశ్రయంలో జిల్లా అధ్యక్షుడికి ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ : బహుళార్థ సాధక పథకమైన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే దురుద్దేశంతో చేపడుతున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై సమరభేరి మోగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రూ.16 వేల కోట్లతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని ఒకపక్క చెబుతూనే.. కేంద్రం బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ   ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు ఈ నెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఈ ఉద్యమ బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అమెరికాలో 20 రోజులు పర్యటించి తిరిగి వచ్చిన ఆయనకు.. మధురపూడి విమానాశ్రయంలో జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన నాయకులు, పార్టీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో మధురపూడి విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్న నెహ్రూను గజమాలలతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి.

అక్కడ నుంచి భారీ కాన్వాయ్‌తో మురారి, కృష్ణవరం, సోమవరం, జగ్గంపేట మీదుగా స్వగ్రామం ఇర్రిపాకకు ఆయన చేరుకున్నారు. జిల్లాలో 20 రోజులుగా నెలకొన్న పరిస్థితులపై పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు నెహ్రూకు వివరించారు. గోదావరి జిల్లాలను ఎడారిగా చేసే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలువరించాలని, జిల్లాలోని పలు ఇసుక రీచ్‌లను నిలువునా దోచుకుంటున్న తెలుగు తమ్ముళ్ల తీరుపై ఉద్యమం చేపట్టాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకం భూమి పూజకు వస్తున్న ముఖ్యమంత్రిని అడ్డుకోవాలని, ఇందుకోసం రైతులతో కలిసి పార్టీ శ్రేణులు భారీగా సిద్ధం కావాలని బోస్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు సూచించారు. దీనిపై నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. పోలవరాన్ని నిర్వీర్యం చేస్తూ, గోదావరి రైతులను అధోగతి పాలుజేసే ఎత్తిపోతల  పథకానికి తనమీద నుంచి నడుచుకుంటూ వెళ్లి శంకుస్థాపన చేయాలని, దీనిని అడ్డుకునేందుకు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా నెహ్రూ అన్నారు.

 ఆయన చేసిన ఈ ప్రకటన పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. గోదావరి జిల్లాల్లో పార్టీ కేడర్‌ను ఉద్యమం దిశగా సిద్ధం చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం నెహ్రూకు సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతలు నిలుపుచేయాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ ఈ నెల 14న హోమం ద్వారా ఉద్యమ పథంలో తొలి అడుగు వేయాలని నిర్ణయించారు. అనంతరం జిల్లా నుంచి పట్టిసీమ వరకూ పాదయాత్ర కూడా చేయాలని, తద్వారా రైతులకు ఎత్తిపోతలువల్ల కలిగే నష్టాన్ని తెలియజేయాలని నేతలు సంకల్పించారు. దీంతోపాటు సామాన్యులకు జిల్లాలో ఇసుక అందకుండా చేస్తున్న టీడీపీ నేతల తీరుపై కూడా పోరు సాగించేందుకు తాను ముందుంటానని నెహ్రూ ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement