వైఎస్సార్ సీపీ సర్పంచ్‌పై దాడి
కొత్తపల్లి :వైఎస్సార్ సీపీకి చెందిన రమణక్కపేట సర్పంచ్ మేరిగి ఆనందరావుపై టీపీడీ కార్యకర్తలు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం విషయం తెలుసుకున్న పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రమణక్కపేటలోని ఎస్సీ పేటలో ఉంటున్న మేరిగి ఆనందరావును పరామర్శించారు. దొరబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో మాత్రమే పార్టీలని, అనంతరం పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు గ్రామాల అభివృద్ధికి పాటుబడాలన్నారు. అధికార టీడీపీ స్థానిక నాయకులకు, కార్యకర్తలను రెచ్చగొట్టి, గొడవలను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు.
దాడులను మానకపోతే క్షమించేది లేద ని హెచ్చరించారు. ఈ సంఘటనపై ఎస్సై ఎన్.కొండయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. సర్పంచ్ మేరిగి ఆనందరావు మాట్లాడుతూ శనివారం తన ఇంటి సమీపంలోని పబ్లిక్ కుళాయి వద్ద నీరు నిలిచిపోగా, తనకు సమాచారం ఇవ్వకుండా స్థానికులు వడ్డి జనార్దన్, అశోక్‌కుమార్, మరికొందరు కలిసి కాలువ తవ్వకం మొదలెట్టారన్నారు. దీనిని ప్రశ్నించగా.. దుర్భాషలాడుతూ, కర్రతో, కత్తితో దాడిచేసి గాయపరిచారని చెప్పారు. ఈ సంఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, ఎస్సై ఎన్.కొండయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి వెళ్లారు మినహా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కాజులూరి చిన్నారెడ్డి, ఆనాల సుదర్శన్, బత్తిన ప్రకాష్ తదితరులు ఆనందరావును పరామర్శించారు.