
‘రెండు కళ్ల’ పార్టీలతో వేదిక పంచుకోలేం
సాక్షి, హైదరాబాద్: సమైక్యవాదానికి మనసా వాచా కర్మణా కట్టుబడని పార్టీలతో, విభజనకు లేఖలిచ్చి, వాటిని వెనక్కి తీసుకోబోమంటున్న పార్టీలతో వేది కలు పంచుకునేందుకు తాము సిద్ధంగా లేమని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికకు వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. శనివారం తాము నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ వైఎస్సార్‌సీపీకి వేదిక లేఖ రాయడం తెలిసిందే.
అందుకు బదులుగా వేదిక కన్వీనర్ అశోక్‌బాబుకు సమాధానంగా వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ‘‘విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలను అనుసరించే పార్టీగా రెండు పడవలపై ప్రయాణం చేయడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న అసెంబ్లీలో, పార్లమెంటులో కూడా తమ సభ్యులను ప్రాంతాలవారీగా ఎగదోస్తున్న పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ మనందరి కళ్లెదుటే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అలాంటి పార్టీలతో మేం వేదిక పంచుకోబోం. స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా విభజనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న పార్టీగా వైఎస్సార్‌సీపీకి ఒక విధానముంది. రాష్ర్టం లోని 70-75 % మంది ప్రజల ఆకాంక్షయిన సమైక్యవాదాన్ని, వారి వాణిని దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీల కు విన్పించడంలో, పార్లమెంటులో సైతం మద్దతు కూడగట్టడంలో మా పార్టీ పోషిస్తున్న పాత్ర ప్రజలకు తెలుసు. చెడిపోయిన రాజకీయాలూ, ఓట్లూ సీట్ల ప్రాతిపదికలే విభజనకు కారణమని అన్ని ప్రాంతాల ప్రజ లూ గుర్తించారు. అఖిలపక్షం కోసం వేదిక తీసుకున్న చొరవను అభినందిస్తున్నాం.
సమైక్యవాదానికి కట్టుబడిన పార్టీలను, ఆయా పార్టీల అధ్యక్షులను మాత్రమే ఆహ్వానించే పక్షంలో భుజం భుజం కలిపి నడవడానికి మేం సిద్ధం. అలాంటి సమావేశంలో స్వయానా మా పార్టీ అధ్యక్షుడే పాల్గొంటారు. త్వరలో అలాంటి సమావేశం జరుగుతుందని కోరుకుంటున్నాం’’ అని మైసూ రా పేర్కొన్నారు. సమైక్యవాదానికి కట్టుబడ్డామని ప్రకటన చేయని పార్టీల అధ్యక్షుల మీద వేదిక నుంచి కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరముందని లేఖలో ఆయన సూచించారు. ‘‘పార్టీ అధ్యక్షులు ముందుకొచ్చి సమైక్యవాణి విన్పిస్తే నాయకులు కూడా అదే బాటలో నడుస్తారు. అలాకాక విభజించండంటూ లేఖ ఇచ్చిన వారు, సమైక్యానికి అనుకూలంగా లేఖ ఇవ్వడానికి సిద్ధపడని పార్టీల వారు కూడా సమైక్యవాద సమావేశాల్లో పాల్గొంటే దాన్ని ప్రజలు హర్షించరు. వేదిక కూడా అలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఏ పార్టీ కూడా సమైక్యానికి అనుకూలంగా ముందుకు రాదు. అటూ ఇటూ రెండు పడవల మీదా ప్రయాణం చేయాలనుకునే సంస్కృతి కలిగిన పార్టీలకు గుణపాఠం నేర్పితేనే వారిలో మార్పు, ఈ వ్యవస్థలోకి నిజాయితీ వస్తాయి. నిజాయితీతో కూడిన రాజకీయాలు, సమైక్యవాదం, ఆం్రధ్రపదేశ్ రాష్ట్రం కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.