సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా వలంటీర్ల కృషి మరువలేనిదని..వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేస్తామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వలంటీర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే డీజీపీకి వినతి ప్రతాలు ఇచ్చామని..రాష్ట్ర్రంలో ఎక్కడైనా కేసులు నమోదయితే కేంద్ర పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. సోషల్ మీడియా వలంటీర్ల సమస్యల పరిష్కారానికి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వలంటీర్ల శ్రమను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నటికీ మరవరన్నారు. పార్టీకి ఎన్ని వింగ్‌లు వున్నా తొలిసారి మీతోనే సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా మీ ప్రాధాన్యత ఏమిటో గుర్తించామని తెలిపారు.
ఎన్నికల ముందు ఎలా పనిచేశారో ఇప్పుడు కూడా అంతకు రెట్టింపుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. అవినీతి రహిత పాలన కోసం జగన్ అన్న చేస్తున్న కృషిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సోషల్ మీడియా ఇంచార్జ్ దేవేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment