డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖలో 2014లో సంభవించిన హుద్‌హుద్ కన్నా.. భూదందా తుపాను తీవ్రమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూదందా తుపాన్‌ను తీరం దాటించి, బయటపడేందుకు టీడీపీ నేతలు రాత్రింబవళ్లు నిద్రలేకుండా ఉన్నారన్నారు. భూకుంభకోణంపై ఎంపీ హరిబాబు గానీ.. పలుమార్లు విశాఖ వస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య గానీ స్పందించకపోవడం శోచనీయమన్నారు.
రూ.25వేల కోట్ల విలువైన భూములు ట్యాంపరింగ్ అయ్యాయని ముందుగా కలెక్టరే చెప్పారని, మంత్రి లోకేష్ విశాఖ వచ్చిన తర్వాత కేవలం 276 ఎకరాల భూములే ట్యాంపరింగ్ అయ్యాయని కలెక్టర్ మాట మార్చడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సిట్‌తో విచారణ చేపట్టడం చూస్తే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భూఅక్రమాలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ మంత్రుల మధ్య యుద్ధం మొదలైందన్నారు. ప్రజాపాలనను గాలికొదిలేసి.. భూకబ్జాలపై టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అనిత, ఆమె అనుచరులు రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, ప్రభుత్వం నుంచి ఎక్కువ పరిహారం తీసుకున్నారని ఆరోపించారు.
భూకుంభకోణంపై తలపెట్టిన భారీ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు లేదన్నారు. తన నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలపై సీబీఐ విచారణ చేపట్టాలని అడిగే దమ్ము అనితకు లేదని, చంద్రబాబు, లోకేష్ మెప్పు కోసం ఇష్టానుసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, మహిళ విభాగం నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, నగర అధికార ప్రతినిధులు వారాది శ్రీదేవి, మళ్ల ధనలత, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్ ఆలీ, జిల్లా సహాయ కార్యదర్శి నూకిరెడ్డి
పాల్గొన్నారు.
భూదందా.. హుద్‌హుద్ కన్నా తీవ్రమైంది
Published Fri, Jun 16 2017 4:59 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement