బాధితులందరికీ అండగా ఉంటాం | YSRCP Support To titli cyclone victims | Sakshi
Sakshi News home page

బాధితులందరికీ అండగా ఉంటాం

Published Wed, Oct 17 2018 7:46 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

YSRCP Support To titli cyclone victims  - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):   తిత్లీ తుపాను తీవ్రతకు నష్టపోయిన వారందరికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని శాసనమండలిలో ఆ పార్టీ ప్రతిపక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేవరకూ బాధితుల తరఫున పోరా టం చేయాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కృష్ణదాస్‌లతో కలిసి   మాట్లాడారు. తుపానుతో ఉద్దానం ప్రాంతమంతా ఛిన్నాభిన్నమై కనీసం తాగేందుకు మంచినీరు, తినడానికి తిండి లేక బాధితులు ఆకలికేకలు వేస్తుంటే వాటన్నింటిని గాలికొదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసం ఫొటోలు దిగడం సరికాదన్నారు. అధికారులంతా సీఎం, మంత్రుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు తప్పితే బాధితుల కష్టాలను తెలుసుకుని తక్షణ చర్యలు ఏమి చేపట్టాలనే విషయాలపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. పంట నష్టాలు గుర్తించడంలోను రైతులకు అనేక ఆంక్షలు విధించి ఏదో ఒకలా నష్టపోయిన విస్తీర్ణాన్ని తగ్గించుకుని పరిహారాలు తూతు మంత్రంగా ఇచ్చేయాలన్న ఆలోచనతో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. అధికారులు కూడా నష్టపోయిన రైతులకు పాస్‌పుస్తకాలు ఉండాల ని.. లేకుంటే పరిహారాలు ఇచ్చేది లేదని షరతులు విధి స్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక వైద్యసౌకర్యాలు గాని, తాగునీటికి ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. 

కన్నకొడుకుని పోగొట్టుకుంటే రూ.1200 పరిహారమా?
ఉద్దాన ప్రాంతంలో కన్నకొడుకులా పెంచుకుంటున్న కొబ్బరి చెట్లు సర్వనాశనమైతే ఒక్కో చెట్టుకు రూ.1200 విలువ కడతారా అని ఉమారెడ్డి ప్రశ్నించారు. కనీసం  ఒక్కో చెట్టుకు రూ.5 వేలు చొప్పున.. ఎకరానికి రూ.. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొబ్బరిచెట్టు మొవ్వుపోయి.. ఆకులు రాలిపోయి పంట వచ్చే అవకాశం లేకుండా పోయిన వాటిని అధికారులు లెక్కల్లో తీసుకోకపోవడం దారుణమన్నారు. పూర్తిగా నేలకూలితేనే పరిహారం ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.

‘నీరు కావాలంటే చంద్రబాబు లిస్ట్‌లో పేరుండాలి’
ఉద్దానం ప్రాంతంలో దాదాపుగా 400 గ్రామాల్లో ప్రజ లు తాగునీరులేక, చంటిపిల్లలకు పాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాజకీయాలకతీతంగా సీఎంగా సాయం అందించాల్సిందిపోయి నేనిచ్చిన లిస్ట్‌లో ఎవరిపేర్లుంటే వారికే నీళ్లివ్వాలని సాక్షాత్తు  చంద్రబాబునాయుడే చెప్ప డం దారుణమన్నారు. తుపాన్‌కు ఇళ్ల పైకప్పులు ఎగిరి పోయి ఇంటిలోకాగితాలు,వస్తువులు తడిచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నవారికి బియ్యం, కూరగాయలు ఇవ్వకుండా రేషన్‌కార్డు తీసుకురావలనడం పద్ధతి కాదన్నారు. తుపాను వచ్చిన మరుసటి రోజు ఓ అమ్మాయి ప్రసవించేందుకు అష్టకష్టాలు పడుతున్నా ఈమెకు వైద్యసహాయం అందించేందుకు ఏ ఒక్క అధికారి కూడా ముందుకురాకపోవడం దౌర్భాగ్యమన్నారు. 

టెక్నాలజీ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఇదేనా బాబు:  పార్ధసారధి
 టెక్నాలజీకి బ్రాండ్‌ అంబాసిడర్‌నని చెప్పుకుంటే ఊకదండపుడు ప్రచారాలు చేసుకుంటున్న చంద్రబాబు తుపాను బాధితులను ఆదుకోవడంలో నీ టెక్నాలజీ ఏమైందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ప్రశ్నించారు. 5 వేల మంది అధికారులను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉంచామని ముఖ్యమంత్రి చెబుతున్నారని.. అయితే ఎంత వెతికినా ఒక్క ఊర్లో కూడా పట్టుమని పదిమంది కనిపించడం లేదన్నారు. ఉద్దానం ప్రాంతంలో ఓ ఐఏఎస్‌ అధికారిణి ఇప్పటికి వరకు ఏమి చేశారు.. ఎంతమందిని ఆదుకున్నారని అడిగితే ఎన్యుమరేషన్‌ అవుతోందని.. బాధితులందరినీ గుర్తించాక పరిహారాలు ఇస్తామని చెప్పారన్నారు. తుపాను వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం కిలో బియ్యం కూడా బాధితులకు ఇవ్వలేదు సరికదా.. ఇందులోను రాజకీయాలు చేయడం తగదన్నారు. రెయ్యిపాడులో ప్రజలంతా నాలుగు రోజులుగా  పస్తులున్నామంటూ నిరసనలు చేయడం, శాంతిపురంలో మంచినీరు ఇవ్వలేదని ఏకంగా చంద్రబాబు  రాక కోసం ప్రజలు ఎదురు చూడడంతోపాటు రోడ్డుపై బైఠాయించారంటే పరిస్థితి ఎంతఘోరంగా ఉందో, సర్కార్‌ బాధితులను ఆదుకోవడంలో ఎంతగా విఫలమైందో అర్థమవుతోందన్నారు.

నష్టపోయిన ప్రతి పంటకు న్యాయ, శాస్త్రీయబద్ధంగా పరిహారాలు ఇవ్వాలన్నారు. పంటలు నష్టపోయి భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారితే అధికారులు పాస్‌పుస్తకాలు తీసుకురావాలి, రేషన్‌కార్డు కావాలని అడుగుతుంటే బాధితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకుంటారని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం,  రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెడ్డి శాంతి, రాజకీయవ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, తణుకు సమన్వయకర్త కె.వి. నాగేశ్వరరావు, నాయకులు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, కె.ఎల్‌.ప్రసాద్, శిమ్మ రాజశేఖర్, సాధు వైకుంఠం,మండవల్లి రవి,మల్లేశ్వరరావు, టి.కామేశ్వరి పాల్గొన్నారు. 

పార్టీ అండగా ఉంటుంది: ధర్మాన
తుపానుకు సర్వం కోల్పోయిన బాధితులందరికీ నాయకులంతా కలిసి భరోసా ఇచ్చి సమస్యలు పరిష్కరించే వరకు తిరిగి రావొద్దని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారని రీజనల్‌ కోఆర్డనేటర్‌ ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి జగన్‌ వచ్చి కలుస్తారని.. అందర్ని ఆదుకుంటారని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చామన్నారు. పంటలు, ఇళ్లు, ప్రాణ, ఆస్తి నష్టాలను పూర్తిగా అంచనాలు వేసి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సాయం అందేవరకు కృషి చేస్తామన్నారు. 

సర్కార్‌ విఫలం:బొత్స
తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 20 మండలాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నార. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి తుపాను వచ్చి నష్టం జరిగితే ఒక్కరికి కూడా చంద్రబాబు న్యాయం చేయలేకపోయేవారన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీని ఉపయోగించి తక్షణమే పునరావాసం కల్పించడం, బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సాయం చేసే విషయంలో సర్కాకర్‌ చేతులెత్తేసిందన్నారు. ఇతర జిల్లాల నుంచి మంచినీటి ట్యాంకర్లు తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా చేయాలని డిమాండ్‌ చేశారు.  బాధితులంతా ఆదుకోవాలని.. ఆకలి తీర్చాలని రోడ్డెక్కితే మంత్రి అచ్చెన్నాయుడు మీరెవరికి ఓటు వేశారో వారికే పరిహారాలు అడగండని రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత గల వ్యక్తులు తమ బాధ్యతలు మరిచి ఇక్కడా రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. సీఎం వచ్చి జిల్లాలో ఉండటం వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారులంతా సీఎం చుట్టూ ఉంటూ బాధితులను ఆదుకోవడం మరిచిపోతున్నారన్నారు. బాధిత గ్రామాలన్నింటిని వైఎస్సార్‌సీపీ  క్షేత్రస్థాయి పరిశీలనచేసి అధికారులందరినీ నిలదీస్తామన్నారు. భాధితులందరికీ న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement