రాప్తాడు : తమ ఇంటి ముందుకు మురుగు నీరు రానివ్వకుండా చూడాలని చెప్పినందుకు ‘ఈ ప్రభుత్వం మాది.. మాకే అడ్డు చెపుతారా.. మురుగు నీళ్లు వదిలేదే.. మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి’ అంటూ గురువారం సాయంత్రం బోగినేపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోగినేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త తలారి వెంకటరాముడు ఇల్లు దిగువ ప్రాంతంలో ఉంది.
ఎగువ ప్రాంతంలో టీడీపీ నాయకుడు, మండల మాజీ కన్వీనర్ ఖాశీంనాయుడు ఇల్లు ఉంది. ఖాశీంనాయుడు నెల రోజులుగా మురుగునీరు రొడ్డు పైకి వదులు తుండటంతో ఆ నీరు తలారి వెంకటరాముడు ఇంటి ముందుకు వచ్చి నిలిచిపోతోంది. దీంతో అక్కడ అపరిశుభ్రత నెలకొంటోంది. ఐదు రోజుల క్రితం మండల స్థాయి అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లి మురుగు నీరు అలా వదల కూడదని ఖాశీంనాయుడుకు హితవు పలికారు. అయినా మార్పు కనిపించలేదు.
ఇలా అయితే తమకు రోగాలు వస్తాయని భావించిన తలారి వెంకటరాముడు భార్య బోయ రాజమ్మ తక్షణమే మురుగునీరు రాకుండా చూడాలని ఖాళీం నాయుడు ఇంటి దగ్గరకు వెళ్లి చెప్పింది. దీంతో ఆయన ‘ప్రస్తుతం ఉన్నది మా ప్రభుత్వం, మేము చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి, నీళ్లు అలాగే వస్తుంటాయి. ఉంటే ఉండండి లేకుంటే గ్రామం వదిలిపెట్టి వెళ్లండి. లేకుంటే గ్రామ బహిష్కరణ చేస్తాం’ అంటూ బెదిరించారు. మీరు ఇలాగే చేస్తే మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అనడంతో ఖాశీంనాయుడు, ఆయన భార్య సంజమ్మ, కూతురు రాధిక ఆగ్రహోదగ్రులై రాజమ్మపై దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజమ్మ కూతురు బోయ సుజాత(18)పైనా బండరాతితో తలపై బాదారు. స్పృహ తప్పి కిందపడిపోయినా వదలకుండా కట్టెలతో విచక్షణారహితంగా కొట్టడంతో సుజాత కోమాలోకి వెళ్లింది. సుజాత మేనమామ మాదన్న కలగజేసుకుని ఆడపిల్లను ఇంత అన్యాయంగా కొడతారా అంటూ ఖాశీంనాయుడిపై చేయిచేసుకుని పక్కకు నెట్టేశారు. స్థానికులు 108 ద్వారా ఆమెను అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. సుజాత పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. తీవ్రంగా గాయపరిచిన వారు కూడా ఐదుగురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.
మాదన్నను చంపుతాం!
ఖాశీం నాయుడిపై చేయి చేసుకున్న మాదన్నను చంపి తీరుతాం అంటూ గ్రామంలో టీడీపీ వర్గీయులు బెదిరించినట్లు సమాచారం. నా మేనకోడలును నా కళ్లముందే రక్తం కారేటట్లు కొడుతుంటే తట్టుకోలేక ఖాశీం నాయుడిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందే కాని తనకు వేరే ఉద్దేశం లేదని మాదన్న వాపోయాడు.
అధికారం ఉందని విర్రవీగుతున్నారు
అధికారంలోకి వచ్చాం కదా అని టీడీపీ నాయకులు విర్రవీగుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రాణాలు అడ్డుపెట్టి తమ కార్యకర్తలను కాపాడుకుంటామని ఆ పార్టీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజమ్మ, సుజాతలను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బోగినేపల్లి టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతోనే తమ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత ఇలాంటి దాడులను ప్రోత్సహించే బదులు గ్రామాల్లో మురుగు నీటి కాల్వల ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని హితవు పరికారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ నేతల దాడి
Published Fri, Aug 8 2014 3:35 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement