భవిష్యత్ మనదే
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ఆర్‌సీపీ సమీక్షలు నిర్వహించింది. పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు తీసుకోవలసినచర్యలపై ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు అభిప్రాయాలను తెలుసుకున్నారు. గాజువాక నియోజకవర్గ నేత తిప్పలనాగిరెడ్డి, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు లు సమీక్షలు నిర్వహించారు.
తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన ఎమ్మె ల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యుల అభ్యర్థులు, కార్యకర్తలతో సమీక్ష చేశారు. వారి వద్ద నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యుడు తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ గెలుపోటములు రాజకీయాల్లో సాధారణమని, ఓటమికి బాధ పడేకంటే భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదిగేందుకు కృషిచేయాలన్నారు. ఎటువంటి పొత్తులు లేకుండా వైఎస్‌ఆర్‌సీపీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుందన్నారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందన్నారు. 2019లో తప్పకుండా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా సమస్యలను ఎదుర్కోవాలో వివరించారు.
ప్రలోభాలకు లొంగొద్దు
వైఎస్‌ఆర్ సీపీ తరఫున గెలిచి, ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు యత్నిస్తే వారిపై విప్ జారీచేసే అధికారం పార్టీకి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి వారిపై అనర్హత వేటు వేయడంతో పాటూ పార్టీ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, భయపెట్టినా లొంగ రాదని సూచించారు. కార్యకర్తల వెనుక పార్టీ ఉందన్న విషయా న్ని తెలియజేస్తూ వారికి అండగా నిలవాలన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.
సంఘటితంగా పోరాడాలి
అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయకుండా కాపాడుకోవాలన్నారు. నాయకులు, కార్యకర్తలంతా సంఘటితంగా కలిసి పోరాటం చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గాల్లో ప్రతి నాయకుడూ... కార్యకర్తలను కలుస్తూ, వారి మంచిచెడ్డలను ఎప్పటికప్పుడు పట్టించుకోవాలని సూచించారు. ఇప్పటికే రెండుమార్లు ఓడిపోయిన చంద్రబాబు... మళ్లీ ఓడిపోతే మూడోసారి మూలన కూర్చోవాల్సి ఉంటుందన్న ఆందోళనతో ఏదోలా అధికారం పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కానీ హామీలను గుప్పించారని ఆరోపించారు.
సంస్థాగతంగా పార్టీనీ పటిష్ట పరచాలన్నారు. పార్టీ నుంచి బయటకు వెళితే అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. విప్ జారీచేసే అధికారం వైఎస్‌ఆర్‌సీపీకీ ఉందన్నారు. నెల్లిమర్ల, ఎస్.కోట, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, విజయనగరానికి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారందరి వద్ద నుంచి సలహాలు, సూచనలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. వీటన్నింటిని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. నెల్లిమర్ల నుంచి డాక్టర్ సురే ష్‌బాబు, సింగుబాబు, కోటగిరి కృష్ణమూర్తి, అంబళ్ల శ్రీరాముల నాయుడు, శ్రీనివాసరావు, పతివాడ అప్పలనాయుడు, పిన్నింటి రామకృష్ణతో పాటూ అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. గజపతినగరం నియోజకవర్గం నుంచి గెద్ద రమేష్ నాయుడు, ఎంఎస్‌ఎన్ మాస్టారు, సూరిబాబు రాజు, కృష్ణబాబురాజు తదితరులు పాల్గొన్నారు.
ఎస్.కోట నియోజకవర్గం నుంచి రొంగలి జగన్నాథం, వేచలపు చినరామునాయుడు, షేక్ రెహ్మాన్, దమయంతి, సింగంపల్లి సత్యం, నెక్కల నాయుడు బాబు, కేత వీరన్న, మల్లునాయుడు తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కె.శ్రీనివాసనాయుడు, మీసాల వెంకటరమణ, గొర్లె వెంకటరమణ, నారాయణరావులు హాజరయ్యారు. కురుపాం నుంచి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, నాయకులు పరీక్షిత్ రాజు, పార్వతీపురం నుంచి జమ్మాన ప్రసన్న కుమార్, సాలూరు నుంచి ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, బొబ్బిలి నుంచి కేత రామారావు, అప్పారావు, నరసింహంనాయుడు, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్, గురాన అయ్యలు, అవనాపు విక్రమ్, మామిడి అప్పలనాయుడు, వాజిద్, చెల్లూరు ఉగ్రనరసింగరావు, భీమరశెట్టి ఉపేంద్ర, గండికోట శాంతి, మజ్జి త్రినాథ్, కొసర నారాయణరావు, నామాల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.