= వైఎస్సార్ సీపీ ‘సమైక్య’ పోరు
= కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
=రోడ్లపైనే వంటావార్పు..ఆటాపాట
= 97 మంది నేతల అరెస్టు, విడుదల
సమైక్యమే అజెండాగా ముందుకెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రహదారుల దిగ్బంధంతో హోరెత్తించింది. జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారులన్నీ పార్టీ శ్రేణులు, సమైక్యవాదుల నినాదాలతో మార్మోగాయి. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ప్రజలు సైతం స్వచ్ఛందంగా పాల్గొని సమైక్యానికి జైకొట్టారు.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా రహదారుల దిగ్బంధం పెద్దఎత్తున జరిగింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రహదారులన్నీ సమైక్య నినాదాలతో హోరెత్తిపోయాయి. అన్ని మండలాల్లోనూ జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజామద్దతు వెల్లువెత్తింది. ఈ సందర్భంగా 97 మంది నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో దిగ్బంధం భారీగా జరిగింది.
గరికపాడు, చిల్లకల్లు, గట్టుభీమవరం, వత్సవాయి, ముళ్లపాడు క్రాస్‌రోడ్ వద్ద గల జాతీయ రహదారులను నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు దిగ్బంధించారు. గరికపాడు వద్ద నిర్వహించిన ఆందోళనలో ఉదయభాను మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్యాకేజీ తొత్తులుగా మారారని ఎద్దేవా చేశారు. తాము చేస్తున్నది ప్రజా ఉద్యమమని, ఎవ రూ అడ్డుకోలేరని చెప్పారు. ఈ సందర్భంగా రహదారిపైనే వంటావార్పు చేశారు.
శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న ఉదయభానును పోలీసులు తీసుకువెళ్లి జీపు ఎక్కించారు. కార్యకర్తలు, నాయకులు ఆయనను విడుదల చేయాలంటూ జీపునకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు. దాదాపు అర్ధగంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు ఉదయభానుతో సహా 40 మందిని అరెస్టు చేసి పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ మండలం పులిగడ్డ, చల్లపల్లిలో జాతీయ రహదారుల దిగ్బంధం జరిగింది.
సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో పులిగడ్డ చౌరస్తాలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. నందిగామ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు సహా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనాసాగరం బైపాస్ వద్ద వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో రోడ్ల దిగ్బంధ కార్యక్రమం నిర్వహించారు. కంచికచర్ల చెరువుకట్ట సమీప బైపాస్, పెనుగంచిప్రోలు మండల పరిధిలో ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద రహదారుల దిగ్బంధం జరిగింది.
గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ బందరు పార్లమెంట్ ఇన్‌చార్జి కుక్కల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, గన్నవరం, పెడన నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఉప్పాల రామ్‌ప్రసాద్‌ల నేతృత్వంలో పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నాలుగు రోడ్ల జంక్షన్‌ను దిగ్బంధం చేశారు. మైలవరం నియోజకవర్గంలో సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు వద్ద విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
ఇబ్రహీంపట్నంలో మరో సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడులో ఉదయం ఆరు గంటలకే నాయకులు రహదారులను దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెనమలూరులో రోడ్ల దిగ్బంధం సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో జరిగింది. తిరువూరు హైవేపై సమన్వయకర్త వల్లభాయ్ ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు.
గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జనార్దనపురం వద్ద సమన్వయకర్త కొడాలి నాని ఆధ్వర్యంలో వందలాది మంది హైవేను దిగ్బంధించారు. పామర్రు నియోజకవర్గంలో సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించి వంటావార్పు నిర్వహించారు. కైకలూరులో సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హైవేను వందలాది మంది దిగ్బంధించారు.
బెజవాడలో.. విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో భవానీపురం స్వాతి థియేటర్ వద్ద మానవహారం చేసి రోడ్డును దిగ్బం ధించారు. సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల సమన్వయకర్తలు పి.గౌతమ్‌రెడ్డి, వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధనాలు జరిగాయి.