=జాతీయ రహదారులపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన
=గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు
=పలువురు నాయకుల అరెస్టు, విడుదల
=నేడూ కొనసాగింపు
సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర నినాదాలతో జాతీయ రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనతో రహదారు లు స్తంభించాయి. గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్రామీణ, ఏజె న్సీ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉదయం 5 గంట ల నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేర కు పార్టీ శ్రేణులు నియోజకవర్గాల వారీ జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని బుధవారం చేపట్టాయి. ఉదయం నుంచే పదులు.. వందల సంఖ్యలో పార్టీ నేతలు, శ్రేణులు జాతీయరహదారులపైకి చేరుకున్నాయి.
జై సమైక్యాంధ్ర.. జైజై జగన్ అన్న నినా దాలతో మిన్నంటించాయి. పాడేరులో ఉద యం 5 గంటల నుంచే పార్టీ శ్రేణులు ఆందోళ నకు దిగడంతో వారపు సంతకు వెళ్లే వాహనా లు గంటలతరబడి నిలిచిపోయాయి. మాడు గుల నియోజకవర్గంలోని కె.కోటపాడులో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. నర్సీపట్నంలో రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి రహదారుల్ని దిగ్బంధించారు. గురువారం కూడా రహదా రుల దిగ్బంధం కొనసాగనుంది.
పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని గంటన్నరకు పైగా దిగ్బంధిం చారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి చెంగలను పక్కకు లాక్కెళ్లి ఆందోళనను భగ్నం చేశారు.
అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ నేత కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో కొణతాల క్యాంప్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో పట్టణ మెయిన్‌రోడ్డు మీదుగా పూడిమడక బైపాస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. రహదారిపై బైఠాయించారు.
చోడవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. బలిరెడ్డి సత్యారావు, పి.వి.ఎస్.ఎన్.రాజుతోపాటు 26 మందిని పోలీసులు అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు.
యలమంచిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద, బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో రిక్షాస్టాండ్ వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఆటోలు, రిక్షాలతో ర్యాలీగా వచ్చి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌గణేష్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్లువేసి వాహనాల రాకపోకల్ని స్తంభింపజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కొనసాగుతోన్న రిలే దీక్షల శిబిరం వద్ద వం టావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు.
మాడుగుల నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం జరిగింది. కె.కోట పాడులో ప్రధాన రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లను, ఆటోలను, వ్యాన్లను నిలిపి ఉదయం ఆరు గంటల నుంచే రాకపోకల్ని స్తంభింపజేశారు. సమన్వయకర్తలతోపాటు మరో నలుగురు కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.
అరకు నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్తలు కుంభా రవిబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్ వద్ద రహదారిని దిగ్బం ధించారు. పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు.
కిడారి సర్వేశ్వరరావు, దొన్ను దొర ఆధ్వర్యంలో అరకులోయ గ్రీన్ వ్యాలీ జంక్షన్‌ను దిగ్బంధించారు. అరకు-పాడేరు ప్రధాన రహదారిపై ఐదు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.
పాడేరు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు సమన్వయకర్తలు సత్యవాణి, కాంతమ్మ, ఈశ్వరి కలిసి చెక్‌పోస్టు వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండల నేతలు హనుమాన్ జంక్షన్, జీకే వీధి ప్రధాన రోడ్లను దిగ్బంధించారు.