
వైఎస్సార్‌సీపీ పశ్చిమ సమన్వయకర్తగా రత్నాకర్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా దాడి రత్నాకర్‌ను నియమిస్తూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి...
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా దాడి రత్నాకర్‌ను నియమిస్తూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాడి వీరభద్రరావు తనయుడైన ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షునిగా పనిచేశారు. తండ్రితోపాటే టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్త లేరు. దీంతో ఆ స్థానంలో దాడి రత్నాకర్‌ను నియమించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.