వైఎస్‌ఆర్‌సీపీదే విజయం | ysrcp won the local society mlc eclections | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీదే విజయం

Published Fri, Mar 17 2017 10:18 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

వైఎస్‌ఆర్‌సీపీదే విజయం - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీదే విజయం

అందరి మద్దతు వైఎస్‌ఆర్‌సీపీకే- గౌరు వెంకట రెడ్డి
కర్నూలు: తెలుగుదేశం నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా స్థానిక సంస్థల ప్రజాప్రతినిదులు వైఎస్‌ఆర్‌సీపీకే సంపూర్ణ మద్దతు తెలిపారని, 150 ఓట్ల మెజార్టీతో తాను ఎమ్మెల్సీగా గెలవబోతున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి తెలిపారు. 

శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు తనకు మొదటి ప్రాధాన్యం ఓటు వేసినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. స్థానిక సంస్థల ప్రతినిధులెవరూ వెళ్లలేదన్నారు. వారందరూ తనకే మద్దతు తెలిపారని చెప్పారు.

తగిన బలం లేకపోయినా బరిలోకి దిగిన తెలుగుదేశం అభ్యర్థి చిత్తుగా ఓడిపోతున్నారని తెలిపారు. మూడేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడంతో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు.
 
అభివృద్థి పథకాలే గెలిపిస్తాయి: శిల్పా
తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తాయని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీల జీతాలు పెంచాలని మండలిలో వాదించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఓట్లు ఒక్కటి కూడా క్రాస్‌ అయ్యే అవకాశం లేదని తెలిపారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement