సాక్షి, అమరావతి/అవుకు: నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. 1976 మే 28న జన్మించిన భగీరథ్‌రెడ్డి.. ఉమ్మడి కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య శ్రీలక్ష్మి(అవుకు జెడ్పీటీసీ సభ్యురాలు), ఇద్దరు కుమారులు రాజ్యాభిషేక్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు.
గవర్నర్ విచారం
ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగీరథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని గవర్నర్ ఆకాంక్షించారని రాజ్‌భవన్ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
సీఎం జగన్ దిగ్భ్రాంతి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి అకాల మరణం పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవుకులోని ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భగీరథ్‌రెడ్డి చురుకైన నాయకుడని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment