ఎర్రబోతుల వెంకటరెడ్డి(ఫైల్)
సాక్షి, కొలిమిగుండ్ల: అందరూ ఆప్యాయంగా ‘పెద్దాయనా’ అని పిలుచుకునే వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి(74) ఇక లేరు. గత నెల తొమ్మిదిన అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. భౌతికదేహాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయానికి తెచ్చి.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పెద్దసంఖ్యలో జనం తరలిచ్చి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రగా స్వగ్రామం నాయినపల్లెకు తరలించి.. ప్రజల అశ్రునయనాల మధ్య జోరువానలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
పలువురి నివాళి
నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, బనగానపల్లె, పాణ్యం ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితర ప్రముఖులు ఎర్రబోతుల భౌతికకాయం వద్ద నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, శ్రీశైలం, నంద్యాల, మంత్రాలయం ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి,శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, బాలనాగిరెడ్డి ఫోన్‌లో ఎర్రబోతుల తనయుడు ఉదయ్‌భాస్కర్‌రెడ్డిని పరామర్శించారు. ఎర్రబోతుల మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తమకు తీరని లోటని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు.
రాజకీయ ప్రస్థానం
ఎర్రబోతుల వెంకటరెడ్డి 1988లో కొలిమిగుండ్ల సింగిల్‌విండో అధ్యక్షుడిగా ఎన్నికై.. కేడీసీసీబీ డైరెక్టర్‌గానూ కొనసాగారు. 1994 నుంచి 1999 వరకు కాంగ్రెస్‌లో పని చేశారు. 1999లో టీడీపీలో చేరారు. 2004లో కోవెలకుంట్ల నుంచి, 2009లో బనగానపల్లె నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. అనంతరం వైఎస్సార్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించారు. ఈ ఏడాది మార్చిలో కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment