
ఉర్రూతలూగించిన యువతరంగం
అనంతపురం కల్చరల్: జిల్లా స్థాయిలో రెండు రోజులు జరిగే డిగ్రీ కళాశాలల విద్యార్థుల యువతరంగం శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. 15 కళాశాలల విద్యార్థులు తమదైన అభినయంతో అందరిని ఆకట్టుకున్నారు. మిమిక్రీ, మోనోయాక్షన్, లఘునాటికలు, చుక్కల ముగ్గులతో పాటు వ్యాసరచన, వక్తృత్వం తదితర వాటిల్లో తమ ప్రతిభ ప్రదర్శించారు. ముఖ్యంగా శ్రీవాణి కళాశాల విద్యార్ధిని సుజిత ప్రదర్శించిన ‘మృత్యుఘోష’ శ్రీరాములు ప్రదర్శించిన కన్నతల్లి ఆవేదన ఏకపాత్రాభినయాలు అందరినీ మంత్రముగ్దుల్ని చేసాయి.
అమ్మాయిలు ముత్యాల ముగ్గులతో, స్పాట్ పెయింటింగ్స్‌తో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జనార్దనశాస్త్రి మాట్లాడుతూ యువతలో అంతర్లీనంగా దాగున్న సృజనాత్మకతకు పదును పెట్టే యువతరంగం స్ఫూర్తిదాయకంగా సాగడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ లక్ష్మీనారాయణ సమన్వయకర్తగా వ్యవహరించిన యువతరంగానికి పల్లవి, శేషయ్య, సత్యనారాయణ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
విజేతలు వీరే...
వ్యక్తృత్వం తెలుగులో నితిన్, ఆంగ్లంలో లక్ష్మణ్ణ, వ్యాసరచన లో హుస్నాబాను, మహబూబ్‌బాషా, హంసలేఖ, జేబాతహసిన్ ప్రతిభ కనబర్చారు. పద్యపఠనంలో మాధురి, ఏకాంకికలో గుంతకల్లు ప్రభుత్వ డిగ్రీకళాశాల బృందం, స్పాట్ పెయింటింగ్‌లో సోమశేఖర్, చుక్కల ముగ్గులో హరిత తదితరులు విజేతలుగా నిలిచారు. వీరికి శనివారం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులందిస్తారు.