కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంథ సంపద డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ వేగవంతమైందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏడు కొండల ప్రాశస్త్యాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతాంశమని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద కాలం గడిచేకొద్దీ తన ప్రభ కోల్పోతోందని, వాటిని వెంటనే డిజిటలైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన అనేకమంది ప్రముఖులను కలుసుకున్నారు. శుక్రవారం హరిద్వార్‌లోని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశ్రమానికి ఆయన వెళ్తారు. కాగా, ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి విజయవాడకు విమాన సేవలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి విమానయాన సేవలు పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌లను మర్యాదపూర్వకంగా కలుసుకున్న టీటీడీ చైర్మన్ వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment