
సాక్షి, అమరావతి : మానసిక వేధింపులకు పాల్పడుతూ, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నారాయణ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈమేరకు ఆయన కమిషన్‌కు రాసిన లేఖను బుధవారం మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో నారాయణ, చైతన్య భాగస్వామ్యంతో నడుస్తున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు చెందిన వివిధ బ్రాంచ్‌ల్లో ఇప్పటికే 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆయన కమిషన్ దృష్టికి తెచ్చారు. ఈ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారని, ఈ కారణంగానే విద్యార్థుల ఆత్మహత్యల వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడుతోందన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి, పద్మావతి మహిళా యూనివర్శిటీ వీసీ రత్నకుమారి నేతృత్వంలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసిందని, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం విచారకరమని సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కలవరం పుట్టించిన బ్లూవెల్ గేమ్, అమాయక యువతకు టాస్క్‌లు ఇచ్చి, వారి ప్రాణాలను వాళ్ళే తీసుకునేలా చేసిందని, ఇదే తరహాలో నారాయణ విద్యా సంస్థల్లో కూడా బలవంతంగా టార్గెట్లు పెడుతున్నారని, ఈ వేధింపులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని కమిషన్‌కు వివరించారు. వెలుగుచూడని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.
నేషనల్ క్రైం రికార్డు బ్యూరో 2015లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించిన ఒత్తిడి కారణంగా 96 మంది మృతి చెందినట్టు పేర్కొందని, అధ్యాపకుల వేధింపులు, విద్యా సంస్థలు క్రూరంగా వ్యవహరించడం వల్లే ఈ ఆత్మహత్యలు జరిగినట్టు తెలిపిందన్నారు. హాస్టళ్ళల్లో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, పొద్దునే లేపడం, రాత్రి పొద్దుపోయే వరకూ చదువు కోసం ఒత్తిడి చేస్తున్నారని, మార్కుల్లో పోటీపడని వారిని యాజమాన్యం దూషించి, ఎందుకు పనికిరాడంటూ అవహేళన చేసి, వారిలో ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేస్తున్నారని సుబ్బారెడ్డి కమిషన్‌కు తెలిపారు.
కార్పొరేట్ కాలేజీలకు చెందిన హాస్టల్స్‌ను ప్రభుత్వ అనుమతి లేకుండా నడిపిస్తున్నారని రాష్ట్ర విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అంగీకరించారని, అక్కడి పరిస్థితులు ఏమీ బాగోలేవని ఆయనే చెప్పారని, దీన్నిబట్టి ప్రభుత్వం చేస్తున్న తప్పేంటో స్పష్టమైందన్నారు. ప్రేమ విఫలమవ్వడం, కుటుంబ సమస్యల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యం చెప్పడం, సమస్యను పక్కదారి పట్టించడం దారుణమని తెలిపారు. యాజమాన్యాల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాలు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయులు స్నేహపూర్వకంగా ఉండకపోవడం వల్ల కార్పొరేట్ కాలేజీ విద్యార్థులు అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారని తెలిపారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా భారీ ఫీజులు వసూలు చేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. అనేక సందర్భాల్లో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా కళ్ళు తెరవడం లేదని, కాబట్టి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment