వైవీయూ ఘటనపై విచారణ
టీడీపీ నేత గోవర్దన్‌రెడ్డిపై చర్యకు డిమాండ్
వైవీయూ :
వైవీయూలో పని చేస్తున్న అసిస్టెం ట్ ప్రొఫెసర్ బి.లక్ష్మీప్రసాద్‌ను టీడీపీ నాయకుడు గోవర్దన్‌రెడ్డి దుర్భాషలాడిన ఉదంతంపై మానవ హక్కుల వేదిక జిల్లా శాఖ విచారణ చేపట్టింది. వేదిక కన్వీనర్ జయశ్రీ, మహిళా సమాఖ్య గౌరవాధ్యక్షురాలు సంజీవమ్మ గురువారం వైవీయూ సెంట్రల్ లైబ్రరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.లక్ష్మీప్రసాద్‌తో మాట్లాడారు. పత్రికల్లో రాయలేని విధంగా బూతు లు తిట్టినట్లు బాధితులు వారికి ఫోన్‌లో తెలిపారు. అనంతరం వారు వైస్ చాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్, రిజిస్ట్రార్ ఆచార్య టి.వాసంతి, పరీక్షల నియంత్రణ విభాగం అధికారి ఆచార్య సాంబశివారెడ్డిని కలసి వివరాలు తెలుసుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు రిజిస్ట్రార్‌ను సైతం ఇష్టానుసారం గా మాట్లాడినట్లు తెలుసుకున్న మానవహక్కుల వేదిక సభ్యులు టీడీపీ నాయకునిపై చర్యలు తీసుకోవాలని వీసీని కోరా రు. గోవర్దన్‌రెడ్డి ఒక పార్టీ నాయకుడిగా ఉంటూ ఇలా ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని జయశ్రీ అన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధ్యాపకుడ్ని నోటికొచ్చినట్లు తిట్టడం సంస్కారం కాదన్నారు. కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా రిజిస్ట్రార్‌ను సైతం మాట్లాడటం పద్ధతి కాదన్నారు. దీనిపై స్పందించిన వీసీ.. జరిగిన సంఘటనపై విచారణ కోరుతూ ఎస్పీని కోరుతామని తెలిపారు.