కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ప్రస్తుత ఎన్నికల్లో మహిళలకు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో మండల ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్లు మంగళవారం రాత్రి ఖరారైన నేపథ్యంలో మరో రెండు రోజుల్లో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు ముమ్మర కసరత్తును ప్రారంభించారు.
జిల్లాలో మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఎస్సీ 10, ఎస్టీ 1, బీసీ 21, జనరల్‌కు 21 స్థానాలు రిజర్వు కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎస్సీ మహిళలకు 5, ఎస్టీ మహిళకు 1, బీసీ మహిళకు 11, జనరల్‌లో మహిళలకు 10 స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. గతంలో జరిగిన రొటేషన్ పద్ధతిని పరిశీలిస్తే ప్రస్తుతం జెడ్పీ పీఠం మహిళలకు రిజర్వు కానుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
1995లో ఓసీ కేటగిరీ కింద పి.పి.నాగిరెడ్డి, 2011లో బీసీ కేటగిరీ కింద బత్తిన వెంకట్రాముడు, 2006లో ఎస్సీ కేటగిరీ కింద లబ్బి వెంకటస్వామి జెడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఓసీ మహిళకు రిజర్వు కానుందన్న ప్రచారం జరుగుతోంది. కాగా ఈ రిజర్వేషన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్‌ను కూడా 2011 జనాభా ప్రాతిపదికన పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించాల్సి ఉంది.
జెడ్పీ పీఠంపై మహిళ?
Published Wed, Mar 5 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement