ఆకలేస్తోంది.. | Zilla Parishad High School in Mid-Day Meal Scheme | Sakshi
Sakshi News home page

ఆకలేస్తోంది..

Published Tue, Jul 8 2014 2:37 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

ఆకలేస్తోంది.. - Sakshi

ఆకలేస్తోంది..

ఆత్మకూరు : తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చినందున తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణ తమకప్పగించాలంటూ తోపుదుర్తి గ్రామంలో తెలుగుతమ్ముళ్లు దౌర్జన్యానికి దిగారు. మెనూ ప్రకారం వంట చేస్తూ వస్తున్న తాము ఎందుకు తప్పుకోవాలని నిర్వాహకురాలు ప్రశ్నించినందుకు వంటగది, సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్‌కు తాళాలు వేసుకుని వెళ్లారు. టీడీపీ నేతల నిర్వాకం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వివరాల్లోకెళితే..

గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. లక్ష్మినరసింహ ఏజెన్సీ పేరిట అనురాధ అనే మహిళ ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితురాలైన ఈమె ఇప్పటి వరకూ మెనూ ప్రకారం వంట చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మధ్యాహ్న భోజనం ఏజెన్సీపై కన్నేశారు.

ఈ మేరకు ఈ నెల మూడో తేదీన ఉన్నతపాఠశాలకు వెళ్లి ‘ఇకపై మీరు వంట చేయక్కర్లేదు. మేమే మధ్యాహ్న భోజనం నిర్వహిస్తాం. ఇందుకు సమ్మతం తెలపండి’ అని ఏజెన్సీ నిర్వాహకురాలు అనురాధకు హుకుం జారీ చేశారు. తహశీల్దార్ నుంచి అనుమతి పొంది ఉంటే మీరే వంట చేయండని ఆమె తెలపగా... టీడీపీ కార్యకర్తలు వినకుండా వంట చేస్తున్న సమయంలోనే పొయ్యిలోకి నీరు పోసి ఆర్పేశారు. అంతటితో ఆగక వంటగది, బియ్యం, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచిన స్టోర్ రూమ్‌కు తాళాలు వేసి వెంట తీసుకెళ్లారు.

జరిగిన సంఘటనపై అనురాధ తహశీల్దార్‌కు ఫోన్‌లో సమాచారమందించారు. నాలుగో తేదీన తాళం పగులగొట్టి..వంట చేస్తామని అనురాధ బంధువులు ప్రధానోపాధ్యాయుడిని కోరగా.. తనకు ఆ అధికారాలు లేవన్నారు. దీంతో అదేరోజు సాయంత్రం వారు తహశీల్దార్‌కు, పోలీస్‌స్టేషన్‌కు అర్జీలు సమర్పించారు. ఐదో తేదీన ఉదయం టీడీపీ కార్యకర్తలు తాము వంట చేస్తామని రాగా... తహశీల్దార్ నుంచి ఉత్తర్వులు తీసుకొస్తే వంట చేయడానికి తమకెటువంటి అభ్యంతరమూ లేదని హెచ్‌ఎం స్పష్టం చేశారు. ఏజెన్సీ నిర్వహణ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక.. ఆకలితో పస్తులు ఉండలేక విద్యార్థులు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. ఐదు రోజులుగా తాళం తీయకపోవడంతో కూరగాయలు పాడైపోయాయి.
 
అధికారులే సమస్య పరిష్కరించాలి
మధ్యాహ్న భోజనం లేక విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై తహశీల్దార్‌కి అర్జీ ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్‌మానిటరింగ్ కమిటీ చైర్మన్, సభ్యులతో సమావేశమై తహశీల్దార్, మండల అభివృద్ది అధికారి, పోలీసు అధికారులు, చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారులు కలిసి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణ సమస్యను పరిష్కరించాలి.     - రమేష్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు, జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల, తోపుదుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement