
సేవ్–ఈ కంపెనీ ఇస్తామని చెప్పిన వాహనాలు, ఇచ్చిన వాహనం(ఊడిపోయిన టైరు)
తిరుపతి సిటీ: శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలోని బ్యాటరీ కార్ల నిర్వహణను గుజరాత్ కంపెనీ చేపట్టింది. ఈ మేరకు ‘సేవ్ ఈ’ ఎలక్ట్రికల్ కంపెనీతో జూ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 12 మంది డ్రైవర్లు ఇకపై గుజరాత్ కంపెనీ నేతృత్వంలో పని చేయాలని జూ అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. జూలో పనిచేసే ఓ అధికారి గుజరాత్ కంపెనీ తో చేతులు కలిపి బ్యాటరీ కార్ల ద్వారా వచ్చే ఆదాయంలో కాంట్రాక్టర్‌కు 60 శాతం, జూకు 40 శాతం చొప్పున కేటాయింపులు చేస్తూ ఒప్పందం చేసుకున్నారు.
మూలనపడ్డ బ్యాటరీ వాహనాలు
జూలో సందర్శకులకు సౌకర్యంగా ఉన్న బ్యాటరీ కార్లు 15 మరమ్మతులకు గురి కావడంతో ఏడాదికి పైగా మూలన పడేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన ‘సేవ్ ఈ’ కంపెనీతో 30 బ్యాటరీ వాహనాలు జూ కు తీసుకొచ్చే విధంగా గత ఏడాది జూలైలోనే ఒప్పందం చేసుకున్నారు. మొదటి విడతగా 5 బ్యాటరీ వాహనాలు తెప్పించారు. అయితే ఆ వాహనాలు తెచ్చిన కొద్ది నెలలకే మరమ్మతులకు గురయ్యాయి. కంపెనీకి చెందిన వాహనాలు నాసికరంగా ఉండటం వల్లే సందర్శకులు కూర్చుని తిరిగేటప్పుడు వాహనాలకు ఉన్న విడిభాగాలు ఊడి పడిపోతున్నా యని డ్రైవర్లు చెబుతున్నారు. గతంలో జూలో ఉన్న వాహనాలకు మరమ్మతులు చేయిస్తే బాగా నడుస్తాయని డ్రైవర్లు చెబుతున్నారు. కానీ లక్షలాది రూపాయలు విలువ చేసే వాటిని మూలన పడేసి ఎక్కడో గుజరాత్‌లో ఉన్న కాంట్రాక్టర్‌కు ఆదాయం సమకూర్చిపెట్టడం వెనుక మతలబు ఏంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
అప్పుడు నో అని.. ఇప్పుడు ఓకే అని..
ఇక్కడ మరో విశేషమేంటంటే 7వ జూ అథారిటీ ఆఫ్ ఏపీ అధికారుల సమావేశంలో బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయలేమని, అంత బడ్జెట్ పెట్టలేమని సేవ్ ఈ సంస్థ ప్రతినిధులు జూ అధికారులకు స్పష్టంగా చెప్పేశారు. జూ అధికారులకు అవసరమైతే తమ కంపెనీ తరపున ఈఎంఐ పద్ధతిలో ఒక్కొక్క వాహనం రూ.3లక్షల 50 వేల చొప్పున 30 వాహనాలను జూకు అందిస్తామని తెలిపారు. అయితే ఈ ప్రతినిధులే 8వ జూ అథారిటీ సమావేశంలో కొత్త వాహనాలు అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
రోడ్డున పడ్డ డ్రైవర్లు
శ్రీవెంకటేశ్వర డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేసే డ్రైవర్లు ఇకపై గుజరాత్‌కు చెందిన సేవ్ ఈ కంపెనీ నుంచే జీతాలు పొందవలసి వుంటుందని జూ అధికారిణి పేర్కొన్నారు. లేకుంటే వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సేవ్ ఈ సంస్థకు జూ అధికారులు తెలియజేశారు. దీంతో డ్రైవర్లు రోడ్డున పడ్డట్టు అయింది. ఇప్పటికే జీతాల పెంపుపై హైకోర్టులో డ్రైవర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు వచ్చి 14 నెలలైనా సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలే ఊడిపోయేలా జూ అధికారులు వ్యవహరించడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment