
శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. ప్రపంచ తొలి ట్రిలియన్(లక్ష కోట్ల) డాలర్ల కంపెనీగా అవతరించింది. ఇప్పుడు యాపిల్ మార్కెట్ క్యాప్.. మొత్తం మెక్సికో ఆర్థిక వ్యవస్థకు సమానం. ట్రిలియన్ డాలర్లు అంటే .. అర్జెంటీనా, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర 27 ప్రధాన దేశాల మొత్తం జీడీపీకి సమానం. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.69 లక్షల కోట్లతో సమానం. ఒకప్పుడు దివాళా కోరల్లో చిక్కుకున్న ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ గల కంపెనీగా నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ గమనాన్ని ఐఫోన్ పూర్తిగా మార్చివేసింది.
దివాలా స్థితి నుంచి...
1976లో ఒక గ్యారేజ్‌లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని అరంభించాడు. ఇతర భాగస్వాములతో వచ్చిన విభేదాల వల్ల ఈ కంపెనీ నుంచి 1985లో ఆయన వైదొలగాల్సి వచ్చింది. 1997లో యాపిల్ కంపెనీ దాదాపు దివాలా స్థితికి వచ్చింది. పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్లో బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీల ధాటికి నిలవలేకపోయింది. దాదాపు మూడో వంతు ఉద్యోగులను తీసేసింది. మూడు నెలల్లో కోలుకోపోతే దివాలా కోసం దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ స్టీవ్ జాబ్స్ యాపిల్‌లో తిరిగి చేరాడు. 1998లో కలర్‌ఫుల్ ఆల్–ఇన్–వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్, ఐమ్యాక్ జీ3ని మార్కెట్లోకి తెచ్చింది. ఇది సూపర్‌హిట్ అయింది. తర్వాత 2001లో పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ ఐపాడ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది మ్యూజిక్ డివైజ్‌ల స్వరూపాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఈ కంపెనీ తెచ్చిన ఐఫోన్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన పనే లేకుండా పోయింది. ప్రతి క్వార్టర్లో 4 లక్షలకు పైగా ఐఫోన్లను విక్రయిస్తోంది.
40 ఏళ్లలో 50,000 శాతం పెరిగిన యాపిల్ షేర్..
2003లో యాపిల్ కంపెనీ షేర్ ధర 1 డాలర్‌గా ఉంది. 2005లో యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు ఈ షేర్ ధర 17 డాలర్లకు చేరింది. గురువారం ఈ టెక్నాలజీ షేర్ 2.8 శాతం ఎగసి 207.05 డాలర్లను తాకడంతో లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది. ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ గల కంపెనీగా అవతరించింది. కార్యకలాపాలు ఆరంభించిన 42 ఏళ్లకు యాపిల్ కంపెనీ ఈ ఘనత సాధించింది. మంగళవారం వెలువడిన ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాలు అంచనాలను మించడంతో బుధ, గురు వారాల్లో ఈ షేర్ 9 శాతం ఎగసింది. 1980లో ఈ కంపెనీ ఐపీఓకు వచ్చింది. ఈ 4 దశాబ్దాల్లో ఈ షేర్ 50,000 శాతం పెరగ్గా, ఇదే కాలంలో అమెరికా ఎస్ అండ్ పీ 500 స్టాక్ సూచీ 2,000 శాతం వృద్ధి సాధించింది. యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాకముందు, 2006లొ యాపిల్ అమ్మకాలు 2,000 కోట్ల డాలర్లు, నికర లాభం 200 కోట్ల డాలర్లుగానూ మాత్రమే ఉండేవి. గత ఏడాదికి కంపెనీ అమ్మకాలు 11 రెట్లు పెరిగి 22,900 కోట్ల డాలర్లకు, నికర లాభం 4,840 కోట్ల డాలర్లకు పెరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీలన్నింటిలోనూ అత్యంత లాభదాయకమైన కంపెనీ ఇదే.
మరికొన్ని రికార్డ్‌లు..
యాపిల్ షేర్ల సంఖ్య 482.99 కోట్లుగా ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్ క్యాప్‌కంపెనీగానే కాకుండా యాపిల్ మరికొన్ని రికార్డ్‌లు సాధించింది. ఒక్క క్వార్టర్లో అత్యధిక లాభం (2,000 కోట్లు) సాధించిన తొలి కంపెనీ ఇదే. అత్యధిక నగదు నిల్వలు(28,500 కోట్ల డాలర్లు) ఉన్న కంపెనీ కూడా ఇదే. ఈ మొత్తం విలువ మన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ(20,000 కోట్ల డాలర్లు) కంటే ఎక్కువ!!
Comments
Please login to add a commentAdd a comment