ఆన్లైన్ నియామకాల వృద్ధి10%: మాన్స్టర్.కామ్
న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ నియామకాలు సెప్టెంబర్‌లో 10 శాతం మేర పెరిగాయి. ఈ వృద్ధికి బీపీవో, లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్ వంటి వివిధ రంగాలు తోడ్పాటునందించాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్‌లో 10 శాతం వృద్ధి నమోదయ్యింది. లాజిస్టిక్స్ రంగంలోని ఆన్‌లైన్ నియామకాలు 32 శాతం మేర పెరిగాయి. ఇక కస్టమర్ సర్వీసెస్ రంగ నిపుణుల నియామకం 66 శాతం మేర ఎగసింది.
ఇక నగరాల వారీగా చూస్తే.. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో కన్నా జైపూర్, అహ్మదాబాద్ వంటి టైర్-2 పట్టణాల్లో ఆన్‌లైన్ నియామకాల జోరు కొనసాగుతోంది. ఆన్‌లైన్ నియామకాల వృద్ధి జైపూర్‌లో 30 శాతంగా, అహ్మదాబాద్‌లో 29 శాతంగా ఉంటే.. ఢిల్లీలో 26 శాతంగా, ముంబైలో 23 శాతంగా నమోదయ్యింది. ఇక పర్యాటక రంగంలో 2013 డిసెంబర్ నుంచి చూస్తే తొలిసారిగా ఆన్‌లైన్ నియామకాల వృద్ధి 8 శాతం మేర తగ్గింది.