1,000 మెగావాట్ల సోలార్ క్షేత్రం
- మహబూబ్‌నగర్ జిల్లాలో 6,000 ఎకరాల్లో
- తెలంగాణ పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అతిపెద్ద సోలార్ క్షేత్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 6,000 ఎకరాల్లో ఇది రానుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సహకారంతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దీనిని ఏర్పాటు చేయనుంది. 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటుకానున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.ప్రదీప్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రణాళిక దశలో ఉందని, మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్‌కు అపార అవకాశాలున్నాయని చెప్పారు. శుక్రవారమిక్కడ సీఐఐ పేపర్‌టెక్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కో మెగావాట్‌కు రూ.6 కోట్ల వ్యయం అవుతుందని, జేవీ తరహాలో ప్రాజెక్టు ఉంటుందని అన్నారు.
కాగితం పరిశ్రమకు మంచిరోజులు..
కలప కొరతతో సతమతమవుతున్న పేపర్ పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ జిల్లాల్లో చెట్ల పెంపకానికి కంపెనీలకు మరిన్ని భూములు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు స్థల సేకరణ కు కావాల్సిన అనుమతులను ప్రభుత్వం వేగవంతంగా ఇవ్వనుంది. తెలంగాణలో నిరుపయోగంగా వేలాది ఎకరాల భూములున్నాయని ప్రదీప్ చంద్ర అన్నారు. వీటిని ఉపయోగంలోకి తేవడం ద్వారా గ్రామీణ ప్రజలకు, సొసైటీలకు మేలు చేకూర్చాలన్నది ప్రభుత్వ ల క్ష్యమని చెప్పారు. కంపెనీలు ముందుకు వస్తే కావాల్సిన అనుమతులకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని వివరించారు. పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేలా త్వరలో ప్రకటించనున్న ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుందని పేర్కొన్నారు.
సిల్క్‌మార్క్ మాదిరిగా..
పట్టు వస్త్రాల నాణ్యతను తెలిపేలా ఉన్న సిల్క్‌మార్క్ మాదిరిగా ఇతర ఉత్పత్తులకూ మార్క్ ఉండాలని ప్రదీప్ చంద్ర అభిప్రాయపడ్డారు. తయారీ ప్లాంట్లకు కూడా ప్రమాణాలు ఉండాలన్నారు. మార్కు ఉన్న ప్లాంట్లలో తయారైన ఉత్పత్తులు నాణ్యమైనవిగా పరిగణిస్తారని వివరించారు. సీఐఐ జీబీసీ వంటి సంస్థలు ఇందుకు చొరవ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను సూచించాలని కోరారు. మార్క్ ఉన్న ఉత్పత్తుల అమ్మకాలకు ఢోకా లేదని అన్నారు. కస్టమర్లకు కూడా నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని చెప్పారు. సీఐఐ గోద్రెజ్ జీబీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.రఘుపతి ఈ సందర్భంగా స్పందిస్తూ తగు విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.