
ఇక ‘విండోస్ ఎక్స్‌పీ’ నిర్వహణ వ్యయం రూ. 1200 కోట్లు
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఏప్రిల్ 8 నుంచి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయనున్న నేపథ్యంలో దీనిపై పనిచేసే పీసీల నిర్వహణ వ్యయాలు ఏటా దాదాపు రూ. 1,190 కోట్లకు (192 మిలియన్ డాలర్లు) పెరగనున్నాయి. విండోస్ ఎక్స్‌పీ ఓఎస్‌పై పనిచేసే ప్రతి పీసీ నిర్వహణ వ్యయం ప్రస్తుతం 75-100 డాలర్లుగా ఉండగా.. ఏప్రిల్ 8 నుంచి ఇది ఏకంగా 300 డాలర్లకు పెరగనుంది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ విషయాలను వెల్లడించింది.
భారత్‌లోని భారీ సంస్థల్లో ఎక్స్‌పీని దాదాపు 40 లక్షల పీసీల్లో వినియోగిస్తుండగా, ఇందులో ఇప్పటికే 84% పీసీలు వేరే ఓఎస్‌కి మారడం జరిగిందని మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ కరణ్ బాజ్వా తెలిపారు. మిగతా 16 శాతంలో అత్యధిక సంస్థలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో ఉన్నాయని.. ఇందులోనూ సింహభాగం ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయని ఆయన వివరించారు. తయారీ, కమ్యూనికేషన్, ఐటీ తదితర రంగ సంస్థలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇవి సత్వరమే వేరే లేటెస్ట్ ఓఎస్‌నకు మారని పక్షంలో కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. 2001లో ఎక్స్‌పీ వచ్చింది. తర్వాత విండోస్ 7, లేటెస్ట్‌గా విండోస్ 8 ఓఎస్‌లను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టడం తెలిసిందే.