న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో 18,000 చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధార్ నమోదుతోపాటు బయోమెట్రిక్ ఐడీ అప్‌డేషన్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ (యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలియజేశారు. కనీసం పది శాఖలకు ఒకటి చొప్పున ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది జూలైలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను యూఐడీఏఐ కోరింది.
‘‘బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18,000 చోట్ల ఈ సదుపాయం కల్పించారు. మిగిలిన చోట్ల కూడా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి’’ అని పాండే తెలిపారు. మొత్తం మీద 26,000 కేంద్రాలు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఖాతాలకు ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంతోనే బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ కోరడం గమనార్హం.
‘‘ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 13,800 శాఖల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10,000 శాఖల్లో ఇవి ఏర్పాటు చేయడం పూర్తయింది. ఇక 13,000 పోస్టాఫీసులకు గాను 8,000 శాఖల్లో వీటిని ఏర్పాటు చేశారు’’ అని పాండే వివరించారు. లక్ష్యం మేరకు మిగిలినవి ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ విషయంలో కష్టించి పనిచేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment