
నిస్సాన్.. ‘సన్నీ’ కొత్త వేరియంట్
ప్రారంభ ధర రూ.7.91 లక్షలు
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘నిస్సాన్’ తాజాగా తన సెడాన్ కారు ‘సన్నీ’లో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.91 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. అధిక ఇంధన సామర్థ్యం, సౌకర్యవంతమైన డ్రైవింగ్, అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్ వంటి పలు ప్రత్యేకతలతో ఈ కొత్త వేరియంట్‌ను తయారుచేశామని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్న ఈ కొత్త సన్నీలో 1.4 లీటర్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.7.91 లక్షలు–రూ.10.89 లక్షల శ్రేణిలో... డీజిల్ ఇంజిన్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.8.8 లక్షలు–రూ.10.76 లక్షల శ్రేణిలో ఉందని తెలిపింది. కొత్త వేరియంట్‌లో పుష్ బటన్ స్టార్ట్ సహా యాంటీ–లాక్ బ్రేకింగ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), బ్రేక్ అసిస్ట్ (బీఏ), డ్యూయెల్ ఫ్రంట్/సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయని వివరించింది. కాగా కంపెనీ భారత్‌లో నిస్సాన్, డాట్సన్ అనే బ్రాండ్ల కింద కార్లను విక్రయిస్తోంది.