న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018–19) భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ కుదించింది. గతంలో అంచనా వేసినట్లు 7.5 శాతం కాకుండా 7.3 శాతానికి మాత్రమే వృద్ధి పరిమితం కాగలదని పేర్కొంది. పెట్టుబడులు, వినియోగం ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉన్నప్పటికీ అధిక చమురు ధరలు, సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు వృద్ధి వేగానికి అవరోధాలుగా మారవచ్చని మూడీస్ తెలిపింది. అయితే, 2019 వృద్ధి అంచనాలు యథాతథంగా 7.5% స్థాయిలోనే కొనసాగిస్తున్నట్లు 2018–19కి సంబంధించి అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితుల అంచనాలపై రూపొందించిన నివేదికలో వెల్లడించింది. ‘2018లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 7.5 శాతం కాకుండా అంతకన్నా తక్కువగా 7.3 శాతంగా మాత్రమే ఉండొచ్చని భావిస్తున్నాం. 2019 అంచనాలు మాత్రం యథాతథంగా 7.5 శాతం స్థాయిలో కొనసాగిస్తున్నాం‘ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ తెలిపింది. కనీస మద్దతు ధరలు పెరగడం, సాధారణ వర్షపాతం ఊతంతో గ్రామీణ వినియోగం పెరుగుతుండటం అధిక వృద్ధికి దోహదపడగలదని పేర్కొంది. దివాలా చట్టం అమలుతో మొండిబాకీల సమస్య కొలిక్కి వచ్చే నేపథ్యంలో.. ప్రైవేట్ పెట్టుబడుల ప్రక్రియ క్రమంగా మెరుగుపడుతుందని వివరించింది.
మరికొంత కాలం జీఎస్‌టీ ప్రభావాలు..
ఆర్థిక వ్యవస్థ జీఎస్‌టీ విధానానికి మారే క్రమంలో మరికొన్ని త్రైమాసికాలపాటు .. వృద్ధిపై కొంత ప్రతికూల ప్రభావాలు కొనసాగే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వివరించింది. ఫలితంగా అంచనా వేసిన దానికన్నా వృద్ధి కొంత మందగించే రిస్కులూ ఉన్నాయని పేర్కొంది. అయితే, ఈ సమస్యలన్నీ క్రమంగా తగ్గుముఖం పట్టగలవని భావిస్తున్నట్లు వివరించింది.
ఒక మోస్తరుగా ప్రపంచ దేశాల వృద్ధి..
అంతర్జాతీయ ఎకానమీ వృద్ధి గతేడాది తరహాలోనే 2018లో కూడా భారీగానే ఉండవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఆఖరు నాటి నుంచి, 2019లో వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. పలు సంపన్న దేశాల్లో ఉద్యోగాల కల్పన పూర్తి స్థాయికి చేరడం, ఇటు సంపన్న.. అటు వర్ధమాన దేశాల్లో రుణాలపై వడ్డీలు పెరుగుతుండటం, రుణలభ్యత కఠినంగా మారుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం కాగలవని మూడీస్ తెలిపింది. జీ–20 దేశాల కూటమి 2018లో 3.3 శాతం, 2019లో 3.2 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. సంపన్న దేశాలు ఈ ఏడాది 2.3 శాతం, వచ్చే ఏడాది 2 శాతం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అయితే, జీ–20లోని వర్ధమాన మార్కెట్లు వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని తెలిపింది. ఇవి ఈసారి, వచ్చే ఏడాది 5.2 శాతం వృద్ధి సాధించవచ్చని తెలిపింది. 2017లో ఇది 5.3 శాతంగా ఉంది. మొత్తంమీద వర్ధమాన మార్కెట్లలో సంక్షోభాలు, చమురు ధరల పెరుగుదల, వాణిజ్యపరమైన వివాదాలు ప్రపంచ ఎకానమీ వృద్ధికి రిస్కులుగా పరిణమించగలవని మూడీస్ తెలిపింది.
ఈసారి వృద్ధి 7.3 శాతమే!!
Published Thu, May 31 2018 1:54 AM | Last Updated on Thu, May 31 2018 1:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment