
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యక్రమం (పీసీఏ) నుంచి మరో మూడు బ్యాంకులు వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో బయటకు వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధుల సాయం, ఎన్‌పీఏల తగ్గుదల వంటి అంశాలతో ఈ అంచనాలు పెట్టుకుంది. 12 ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.48,239 కోట్లు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే కొన్ని వారాల్లోనే కార్పొరేషన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులను పీసీఏ నుంచి తొలగించే అంశంపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈ విడత ప్రభుత్వ నిధుల సాయంలో... అత్యధికంగా రూ.9,086 కోట్లతో కార్పొరేషన్ బ్యాంకు, రూ.6,896 కోట్లతో అలహాబాద్ బ్యాంకు లబ్ధి పొందనున్నాయి.
ఈ నిధులతో మూలధన నియంత్రణ ప్రమాణాలను అవి చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది. గత డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన మూలధన నిధుల సాయం అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు పీసీఏ నుంచి విముక్తి లభించింది. దీంతో పీసీఏ పరిధిలో బ్యాంకుల సంఖ్య 11 నుంచి 8కి తగ్గింది. ఏప్రిల్ 1 నుంచి దేనా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అవుతుండడంతో ఈ సంఖ్య 7కు తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment