స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ ఉంది కదా? అని ఎడాపెడా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేస్తుంటారు కొంతమంది యూజర్లు. కానీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ యాప్స్‌తో మాల్‌వేర్ అటాక్‌లు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెనుముప్పు కలిగించే చైనీస్ యాప్స్ వివరాలను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. దీనిలో 42 మొబైల్ అప్లికేషన్లున్నాయి. ఈ యాప్స్ వల్ల భారత భద్రతా వ్యవస్థకు ముప్పు వాటిల్లి ఉందని హెచ్చరించాయి. వెంటనే మీ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని దేశీయ సైన్యాన్ని, పార్లమెంటరీని ఆదేశించాయి. '' చైనీస్ డెవలపర్లు అభివృద్ధి చేసిన యాప్స్ వాడటం ద్వారా ఫోన్లలోని సమాచారం అంతా చైనాకి చేరిపోతుంది. ఈ యాప్స్ డౌన్‌లోడ్ వల్ల మాల్‌వేర్ అటాక్స్ జరుగుతున్నాయి'' అని వార్నింగ్ బెల్ మోగించింది.
ఆ 42 మొబైల్ యాప్స్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, స్మార్ట్‌ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని భారత సైన్యానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆదేశాలు జారీచేసింది. అదనంగా కొన్ని ఇంటర్నెట్ మోడల్స్‌ను కూడా హానికరమైన కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని పేర్కొంది. ఏ యాప్ అయినా డేటాను అధికంగా వినియోగిస్తుంటే.. అది కచ్చితంగా అదనపు సమాచారాన్ని సేకరిస్తుందని భావించాలని భద్రతా నిపుణులు సందీప్ సేన్ గుప్తా వెల్లడించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిత యాప్స్‌గా పేర్కొన్న వాటిలో అత్యంత పాపులర్ అయిన షేర్ ఇట్, ట్రూకాలర్, యాంటీ వైరస్, వెబ్ బ్రోజర్స్ వంటివి కూడా ఉన్నాయి.
42 డేంజర్ యాప్స్ ఇవే : వీబో, వి చాట్ , షేర్‌ఇట్ , ట్రూకాలర్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, బ్యూటీ ప్లస్, న్యూస్‌డాగ్, వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్, ప్యారెలల్ స్పేస్, ఏపీయూఎస్ బ్రౌజర్, ఫర్‌ఫెక్ట్ కార్ప్, వైరస్ క్లీనర్, సీఎం బ్రౌజర్, ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్డర్, వాల్యుట్ హైడ్, యూక్యామ్ మేకప్, ఎంఐ స్టోర్, క్యాచి క్లీనర్ డీయూ యాప్స్ స్టూడియో, డీయూ బ్యాటరీ సేవర్, డీయూ క్లీనర్, డీయూ ప్రైవసీ, 360 సెక్యురిటీ, డీయూ బ్రౌజర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్, బైడు ట్రాన్స్‌లేట్, బైడు మ్యాప్, వండర్ కెమెరా, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఫోటో వండర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ న్యూస్‌ఫీడ్, విసింక్, క్యూక్యూ సెక్యురిటీ సెంటర్, సెల్ఫీసిటీ, మెయిల్ మాస్టర్, ఎంఐ వీడియో కాల్-షావోమి, క్యూక్యూ లాంచర్.
దీనిపై స్పందించిన ట్రూకాలర్, తాము స్వీడన్‌కు చెందిన కంపెనీ అని, ఈ జాబితాలో తమ పేరు ఎందుకు వచ్చిందో విచారణ జరుపుతామని తెలిపింది. ట్రూకాలర్ మాల్‌వేర్ కాదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment