ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ సహా ఆరు సంస్థల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ సహా ఆరు సంస్థల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) సిఫార్సుల మేరకు ఆమోదించిన ఈ ప్రతిపాదనల విలువ రూ. 1,810 కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా పరిణామంతో ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) తమ వాటాలను 50.16 శాతం నుంచి 80 శాతానికి పెంచుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. అక్టోబర్ 30 నాటి సమావేశంలో ఎఫ్‌ఐపీబీ.. ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్‌తో పాటు ఎజైల్ ఎలక్ట్రిక్ సబ్ అసెంబ్లీ, షేర్‌ఖాన్, సీక్వెంట్ సైంటిఫిక్, మాన్‌సూన్ క్యాపిటల్, సెరాప్ ఇండియా ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను ఆమోదించింది. ఫోక్స్‌వ్యాగన్ ఫైనాన్స్ ప్రతిపాదనను తిరస్కరించింది.