వివాదాస్పద నిర్ణయాన్ని తాపీగా వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని సాదాసీదాగా వెల్లడించింది. దేశభద్రత దృష్ట్యా ఇన్నాళ్లూ వ్యతిరేకించిన విధానాన్ని వెనక్కి తీసుకుంది. పాకిస్థాన్ అధికారులతో కశ్మీర్ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ నేతల చర్చలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ రెండు వర్గాల చర్చలపై రెండేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే. సింగ్ పార్లమెంట్ కు రాతపూర్వకంగా తెలిపారు.
'జమ్ముకశ్మీర్ భారత్ లో అంతర్భాగం. ఆ రాష్ట్రానికి చెందిన సోకాల్డ్ నాయకులు కూడా భారత పౌరులే. కాబట్టి వాళ్లు ఏ దేశానికి చెందిన ప్రతినిధులతోనైనా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ద్వైపాక్షిక విధానంలోనే భారత్,పాక్ ల మధ్య సంవాదాలు కొనసాగుతాయి. మూడో ప్రతినిధి(థార్డ్ పార్టీ) ప్రమేయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ల అమలులో భాగంగానే భారత్ ఈ విధానాన్ని అనుసరిస్తోంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని పాకిస్థాన్ కు పలుమార్లు విజ్ఞప్తిచేశాం' అని వీకే సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
2001 ఆగ్రా సదస్సు తర్వాత నుంచి పాక్ ప్రభుత్వ ప్రతినిధులు.. కశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వ ప్రతినిధులతోకంటే హురియత్ నేతలతో మాట్లాడేందుకే ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పాక్ సంకేతాలు ఇవ్వడం భారత్ కు రుచించలేదు. అయినా సరే ఆ ఇరు వర్గాల సమావేశాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 2014లో మోదీ ప్రధానిగా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినవెంటనే పాకిస్థాన్ ప్రతినిధులతో హురియత్ నేతల చర్చలపై నిషేధం విధించింది. గతేడాది ఆగస్ట్ లో జాతీయ భద్రతా సలహాదారు సర్తార్ అజీజ్ భారత పర్యటన సందర్భంగా ఈ వివాదం తారాస్థాయికి చేరింది.
ప్రభుత్వ ప్రతినిధులను కసుకోవడానికంటే ముందే సర్తార్.. కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరపాలనుకోవడం, అందుకు భారత్ నిరసన తెలపడంతో ఆయన పర్యటన అర్ధారంతరంగా రద్దైంది. ఇక ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషనర్ కార్యాలయంలో జరిగే పాకిస్థాన్ డే వేడుకలకు హురియత్ నేతలను ఆహ్వానించడం నుంచి, చీటికీ మాటికీ వారితో చర్చలు జరుపుతూ జోరీగలా తయారైన పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ను ఏరకంగానూ కేంద్రం నిలువరించలేకపోయింది. నిషేధం ఉన్నా ఇరు పక్షాల కలయికలు ఆగకపోవడంతో చివరికి ' వారు కలుసుకోవచ్చు' అని ప్రకటించింది. హురియత్ నేతలతో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్(ఫైల్ ఫొటో)