Hurriyat Conference
-
కశ్మీర్ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పీపుల్స్ ఫ్రీడం లీగ్(జేకేపీఎఫ్‌ఎల్)తోపాటు వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్‌తో సంబంధమున్న జమ్మూకశ్మీర్ పీపుల్స్ లీగ్(జేకేపీఎల్)లోని అన్ని గ్రూపులపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఉపా) కింద కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విధించింది. దీంతోపాటు, ఉగ్రవాద ఆరోపణలపై జైలులో ఉన్న యాసిన్ మాలిక్ సారథ్యంలోని జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)పై నిషేధాన్ని మరో అయిదేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఉగ్ర సంస్థలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. -
హురియత్‌కు గిలానీ గుడ్‌బై
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు, వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 పార్టీల కూటమి అయిన హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలుగుతున్నట్టు సోమవారం ప్రకటించారు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని, సభ్యుల్లో తిరుగుబాటుతనం పెరిగిందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న 90 ఏళ్ల వయసున్న గిలానీ గత ఏడాది కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి అనిశ్చితిలో పడిపోయారు. 1993లో అవిభక్త హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక సభ్యుడైన గిలానీ 2003లో భేదాభిప్రాయాలతో వేరు కుంపటి పెట్టారు. అప్పట్నుంచి ఆయనే సంస్థకు జీవితకాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అవకాశవాదులు పెరిగిపోయారు సంస్థలో అవకాశవాద రాజకీయాలు పెరిగాయని, పీఓకేలో నాయకులందరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కశ్మీర్ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. హురియత్ కాన్ఫరెన్స్ సభ్యులు చాలా మంది పీఓకే ప్రభుత్వంలో చేరుతున్నారని, ఆర్థిక అవకతవకలకు కూడా పాల్పడుతున్నారని ఓ వీడియో సందేశంలో గిలానీ ఆరోపించారు. -
కశ్మీర్ రాజకీయాల్లో కీలక పరిణామం
-
‘ఆర్మీ స్కూల్స్‌కు పిల్లలను పంపకండి’
సాక్షి, శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఆర్మీ విద్యాసంస్థలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లింలు.. తమ పిల్లలను ఆర్మీ స్కూల్స్‌కు పంపవద్దని పిలుపునిచ్చారు. ఆర్మీ విద్యాసంస్థలు.. ముస్లిం సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా విద్యా బోధన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలు ఎవరూ.. తమ పిల్లలను ఆర్మీ విద్యాసంస్థలకు పంపవద్దని పిలుపునిచ్చారు. ఆర్మీ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. మని పిల్లలు పూర్తిగా మారిపోతారని ఆయన చెప్పారు. అంతేకాక ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం, సంప్రదాయాలు ఉన్న ఇస్లాం నుంచి చిన్నారులు దూరంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆర్మీ విద్యాసంస్థలకన్నా.. మంచి ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ, ఇతర విద్యాసంస్థల్లో చిన్నారులను చేర్చాలని ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. -
మోదీది హిందూ అజెండా!?
సాక్షి, శ్రీనగర్ : దేశంలోకి ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను అనుమతించకపోవడంపై హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మాన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని మతరాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ట్విటర్ వేదికగా హురియత్ నేత కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు చాలా కాలంగా ఇస్లామింగ్ బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇస్లామ్ చట్టాల ప్రకారం విధులు నిర్వహించే ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. -
వివాదాస్పద నిర్ణయాన్ని తాపీగా వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని సాదాసీదాగా వెల్లడించింది. దేశభద్రత దృష్ట్యా ఇన్నాళ్లూ వ్యతిరేకించిన విధానాన్ని వెనక్కి తీసుకుంది. పాకిస్థాన్ అధికారులతో కశ్మీర్ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ నేతల చర్చలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ రెండు వర్గాల చర్చలపై రెండేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే. సింగ్ పార్లమెంట్ కు రాతపూర్వకంగా తెలిపారు. 'జమ్ముకశ్మీర్ భారత్ లో అంతర్భాగం. ఆ రాష్ట్రానికి చెందిన సోకాల్డ్ నాయకులు కూడా భారత పౌరులే. కాబట్టి వాళ్లు ఏ దేశానికి చెందిన ప్రతినిధులతోనైనా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ద్వైపాక్షిక విధానంలోనే భారత్,పాక్ ల మధ్య సంవాదాలు కొనసాగుతాయి. మూడో ప్రతినిధి(థార్డ్ పార్టీ) ప్రమేయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ల అమలులో భాగంగానే భారత్ ఈ విధానాన్ని అనుసరిస్తోంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని పాకిస్థాన్ కు పలుమార్లు విజ్ఞప్తిచేశాం' అని వీకే సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 2001 ఆగ్రా సదస్సు తర్వాత నుంచి పాక్ ప్రభుత్వ ప్రతినిధులు.. కశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వ ప్రతినిధులతోకంటే హురియత్ నేతలతో మాట్లాడేందుకే ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పాక్ సంకేతాలు ఇవ్వడం భారత్ కు రుచించలేదు. అయినా సరే ఆ ఇరు వర్గాల సమావేశాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 2014లో మోదీ ప్రధానిగా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చినవెంటనే పాకిస్థాన్ ప్రతినిధులతో హురియత్ నేతల చర్చలపై నిషేధం విధించింది. గతేడాది ఆగస్ట్ లో జాతీయ భద్రతా సలహాదారు సర్తార్ అజీజ్ భారత పర్యటన సందర్భంగా ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వ ప్రతినిధులను కసుకోవడానికంటే ముందే సర్తార్.. కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరపాలనుకోవడం, అందుకు భారత్ నిరసన తెలపడంతో ఆయన పర్యటన అర్ధారంతరంగా రద్దైంది. ఇక ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషనర్ కార్యాలయంలో జరిగే పాకిస్థాన్ డే వేడుకలకు హురియత్ నేతలను ఆహ్వానించడం నుంచి, చీటికీ మాటికీ వారితో చర్చలు జరుపుతూ జోరీగలా తయారైన పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ను ఏరకంగానూ కేంద్రం నిలువరించలేకపోయింది. నిషేధం ఉన్నా ఇరు పక్షాల కలయికలు ఆగకపోవడంతో చివరికి ' వారు కలుసుకోవచ్చు' అని ప్రకటించింది. హురియత్ నేతలతో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్(ఫైల్ ఫొటో) -
కాశ్మీర్ వ్యాలీలో స్తంభించిన జనజీవనం
కిష్ట్వార్ పట్టణంలో ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం కాశ్మీర్ వ్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో ఆ ప్రాంతంలో జనజీవనం దాదాపుగా స్తంభించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు అన్ని మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయలు, బ్యాంక్ కార్యకలాపాలు అంత సజావుగా సాగడం లేదు. అలాగే వేసవి కారణంగా ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కిష్ట్వార్ పట్టణంలో పరిస్థితులను సమీక్షించిన తరువాత తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని హురియత్ కాన్ఫరెన్స్ నేతలు వెల్లడించారు. కిష్ట్వార్ పట్టణంలో రెండు మతాలకు చెందిన వర్గాల మధ్య శుక్రవారం జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య శనివారానికి రెండుకు చేరింది. ఈ ఘర్షణలో మరో 20 మంది గాయపడి వివిధ ఆసుపత్రల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.