
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు, వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 పార్టీల కూటమి అయిన హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలుగుతున్నట్టు సోమవారం ప్రకటించారు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని, సభ్యుల్లో తిరుగుబాటుతనం పెరిగిందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న 90 ఏళ్ల వయసున్న గిలానీ గత ఏడాది కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి అనిశ్చితిలో పడిపోయారు. 1993లో అవిభక్త హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక సభ్యుడైన గిలానీ 2003లో భేదాభిప్రాయాలతో వేరు కుంపటి పెట్టారు. అప్పట్నుంచి ఆయనే సంస్థకు జీవితకాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
అవకాశవాదులు పెరిగిపోయారు
సంస్థలో అవకాశవాద రాజకీయాలు పెరిగాయని, పీఓకేలో నాయకులందరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కశ్మీర్ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. హురియత్ కాన్ఫరెన్స్ సభ్యులు చాలా మంది పీఓకే ప్రభుత్వంలో చేరుతున్నారని, ఆర్థిక అవకతవకలకు కూడా పాల్పడుతున్నారని ఓ వీడియో సందేశంలో గిలానీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment