Syed Ali Shah Geelani
-
వేర్పాటువాద నాయకుడు గిలానీ మృతి, సంతాపదినంగా ప్రకటించిన పాక్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషే ధిత జమాత్-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గిలానీ గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు గిలానీ మృతిపట్ల పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం గిలానీ మరణంతో కశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతోపాటు మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను మోహరించాలని అధికారులు ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు గిలానీ మృతిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. అంతేకాదు ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన గిలానీని భారత ప్రభుత్వం వేదించిందని ఆరోపించారు. ఆయనకు నివాళిగా ఈ రోజు పాక్ జెండాను అవనతం చేసి, అధికారిక సంతాప దినంగా పాటిస్తామని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Saddened by the news of Geelani sahab’s passing away. We may not have agreed on most things but I respect him for his steadfastness & standing by his beliefs. May Allah Ta’aala grant him jannat & condolences to his family & well wishers. — Mehbooba Mufti (@MehboobaMufti) September 1, 2021 We in Pakistan salute his courageous struggle & remember his words: "Hum Pakistani hain aur Pakistan Humara hai". The Pakistan flag will fly at half mast and we will observe a day of official mourning. — Imran Khan (@ImranKhanPTI) September 1, 2021 -
ఇమ్రాన్ వక్రబుద్ధి : గిలానీకి అత్యున్నత పురస్కారం
ఇస్లామాబాద్ : భారత వ్యతిరేక శక్తులను ఎప్పుడూ తమ మిత్రులుగా భావించే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది. కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన గిలానీని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రశంసల్లో ముంచెత్తింది. అంతేకాకుండా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ -ఈ- పాకిస్తాన్’ అనే బిరుదుకు గిలానీని ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం ఆయనకు అవార్డును ప్రకటించింది. (వేర్పాటువాద నాయకుడు సంచలన నిర్ణయం) కశ్మీర్ కల్లోలానికి పరోక్ష కారణమైన సయ్యద్‌కు పాకిస్తాన్ అత్యున్నత అవార్డును ప్రకటించడంలో ఆంతర్యం ఏంటన్నిది తెలియరాలేదు. మరోవైపు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి తొలి ఏడాది పూర్తి కావడానికి సరిగ్గా వారం ముందు ఈ అవార్డును ప్రకటించడం గమనార్హం. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 16 పార్టీల కూటమి అయిన హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సంస్థ సిద్దాంతం పక్కదారి పట్టిందని, సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గిలానీ ప్రకటించారు. కాగా చాలాకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటోన్న 90 ఏళ్ల వయసున్న గిలానీ గత ఏడాది కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి అనిశ్చితిలో పడిపోయారు. 1993లో అవిభక్త హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక సభ్యుడైన గిలానీ 2003లో భేదాభిప్రాయాలతో వేరు కుంపటి పెట్టారు. అప్పట్నుంచి ఆయనే సంస్థకు జీవితకాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన సంస్థ నుంచి వైదొలిగినా పాకిస్తాన్ పౌర పురస్కారం ప్రకటించడంతో మరోసారి తెరమీదకు వచ్చారు. -
హురియత్‌కు గిలానీ గుడ్‌బై
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు, వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 పార్టీల కూటమి అయిన హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలుగుతున్నట్టు సోమవారం ప్రకటించారు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని, సభ్యుల్లో తిరుగుబాటుతనం పెరిగిందని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న 90 ఏళ్ల వయసున్న గిలానీ గత ఏడాది కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి అనిశ్చితిలో పడిపోయారు. 1993లో అవిభక్త హురియత్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక సభ్యుడైన గిలానీ 2003లో భేదాభిప్రాయాలతో వేరు కుంపటి పెట్టారు. అప్పట్నుంచి ఆయనే సంస్థకు జీవితకాల చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అవకాశవాదులు పెరిగిపోయారు సంస్థలో అవకాశవాద రాజకీయాలు పెరిగాయని, పీఓకేలో నాయకులందరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కశ్మీర్ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. హురియత్ కాన్ఫరెన్స్ సభ్యులు చాలా మంది పీఓకే ప్రభుత్వంలో చేరుతున్నారని, ఆర్థిక అవకతవకలకు కూడా పాల్పడుతున్నారని ఓ వీడియో సందేశంలో గిలానీ ఆరోపించారు. -
కశ్మీర్ రాజకీయాల్లో కీలక పరిణామం
-
వదంతులతో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్
శ్రీనగర్ : కశ్మీర్లో బుధవారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. గిలానీ ఆరోగ్యం క్షీణించిందని బుధవారం రాత్రి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పోస్టులు పెట్టినట్టు అధికారులు తెలిపారు. తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని చెప్పారు. అలాగే శాంతి భద్రతలను అదుపు తప్పకుండా ఉండేందుకు కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించామని అన్నారు. మరోవైపు గిలానీ ఆరోగ్యంపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. గిలానీ కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం కేంద్రం అక్కడ అన్నిరకాల సమాచార వ్వవస్థలను కొద్ది నెలలపాటు స్తంభింప చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గిలానీ రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయడం కలకలం రేపింది. దీంతో ట్విటర్ ఆయన ఖాతాను నిలిపివేసింది. అయితే సమాచార వ్యవస్థపై అంక్షలు ఉన్నప్పటికీ.. గిలానీ ట్వీట్ చేసేందుకు సహకరించిన బీఎస్ఎన్ఎల్కు చెందిన ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. (చదవండి: ‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’) -
వివాదాస్పద ట్వీట్ : బీఎస్ఎన్ఎల్ అధికారులపై వేటు
వేర్పాటువాద నాయకుడు (91) సయ్యద్ అలీషా గిలానీ ట్వీట్ వివాదం నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై వేటు పడింది. 370 ఆర్టికల్ రద్దు అనంతరం తీవ్రమైన ఆంక్షల మధ్య, గిలానీ ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు బీఎస్ఎన్ఎల్కు చెందిన ఇద్దరు అధికారులు గిలానీకి సహకరించినట్టుగా తేల్చారు. దీంతో ఇద్దరినీ విధులనుంచి సస్సెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం కేంద్రం అక్కడ అన్నిరకాల సమాచార వ్వవస్థలను స్తంభింప చేసింది. ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370 రద్దును ప్రకటించక ముందునుంచే (ఆగస్టు, 4) మొత్తం రాష్ట్రంలో ల్యాండ్లైన్లతో సహా, అన్ని కమ్యూనికేషన్ సౌకర్యాన్ని రద్దు చేసినప్పటీకీ, అలీషా గీలానీ కొన్ని ట్వీట్లు చేయడం దుమారం రేపింది. ఆగస్టు 8 ఉదయం వరకు ఆయనకు ల్యాండ్‌లైన్ ఫోన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎలా అందుబాటులోకి వచ్చిందన్నది చర్చనీయాంశమైంది. ఆయన ట్వీట్లు రెచ్చగొట్టేవిగా ఉన్నాయంటూ ట్విటర్ ఖాతాను నిలిపి వేసింది. కాగా 370, 35 ఏ అధికరణలు రద్దు అనంతరం కశ్మీర్లో అగ్ర రాజకీయ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా వందలాది మందిని గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. -
‘ఆర్మీ స్కూల్స్‌కు పిల్లలను పంపకండి’
సాక్షి, శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, హురియత్ కాన్ఫెరెన్స్ ఛైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ఆర్మీ విద్యాసంస్థలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లింలు.. తమ పిల్లలను ఆర్మీ స్కూల్స్‌కు పంపవద్దని పిలుపునిచ్చారు. ఆర్మీ విద్యాసంస్థలు.. ముస్లిం సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా విద్యా బోధన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలు ఎవరూ.. తమ పిల్లలను ఆర్మీ విద్యాసంస్థలకు పంపవద్దని పిలుపునిచ్చారు. ఆర్మీ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. మని పిల్లలు పూర్తిగా మారిపోతారని ఆయన చెప్పారు. అంతేకాక ప్రత్యేక సంస్కృతి, జీవన విధానం, సంప్రదాయాలు ఉన్న ఇస్లాం నుంచి చిన్నారులు దూరంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆర్మీ విద్యాసంస్థలకన్నా.. మంచి ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ, ఇతర విద్యాసంస్థల్లో చిన్నారులను చేర్చాలని ఆయన తల్లిదండ్రులకు చెప్పారు. -
కశ్మీర్లో కీలక పరిణామం!
శ్రీనగర్: గత మూడు నెలలుగా ఆందోళనలు, అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం, వేర్పాటువాదుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఒక ముందడుగు పడింది. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం వేర్పాటువాద అగ్రనేత సయెద్ అలీషా గిలానీతో భేటీ అయింది. గిలానీ-సిన్హా బృందం దాదాపు గంటపాటు సమావేశమై చర్చించింది. చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు సిన్హా తెలిపారు. అయితే, తమది అధికారిక ప్రతినిధి బృందం కాదని, వ్యక్తిగత స్థాయిలో కశ్మీర్‌లోని పరిస్థితులను బేరీజు వేసేందుకు మాత్రమే తాము వచ్చినట్టు ఆయన చెప్పారు. కశ్మీర్లో తాజా పరిస్థితులపై కేంద్రం, వేర్పాటువాదుల మధ్య చర్చలకు వీలు కల్పించే కృషిలో భాగంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. గత జూలై 8న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయ ఆందోళనలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లోయలో అశాంతి నెలకొంది. ఆందోళనలు కొనసాగుసతుండటంతో లోయలో జనజీవనం చాలావరకు స్తంభించింది. ఈ నేపథ్యంలో గృహనిర్బంధంలో ఉన్న గిలానీతో భేటీ అయ్యేందుకు సిన్హా నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి వీలు కల్పించారు. కశ్మీర్లో ప్రతిష్టంభన తొలగించేందుకు అవసరమైన రాజకీయ చర్చలకు వీలు కల్పించే దిశగా ఈ బృందం ఉదారవాద వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరుఖ్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్‌లతో కూడా చర్చలు జరుపనుంది. -
గిలానీ.. ఓ సారి మా ఊరికిరా..
- కశ్మీర్ వేర్పాటువాదనేత గిలానీకి నవాజ్ షరీఫ్ ప్రత్యేక లేఖ - పాకిస్థాన్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ మరోసారి భారత్ ను రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇదే అంశంపై ఇరుదేశాలు భిన్నవాణులను వినిపించిన దరిమిలా చర్చల ప్రక్రియ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. పాకిస్థాన్ పర్యటనకు రావాల్సిందిగా హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీకి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం పంపడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు నవాజ్ పంపిన ఆహ్వాన పత్రాన్ని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్.. గిలానీకి అందజేశారు. 'శుక్రవారం రాత్రి జరిగిన విందు సమావేశంలో బాసిత్.. నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వానాన్ని గిలానీకి అందజేశారు' అని పాక్ కమిషనర్ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాలను ఆయన ఉటంకించారు. కశ్మీర్ అంశం కారణంగా పార్ ఏర్పాటు ప్రక్రియ అసంపూర్ణంగా మిగిలిపోయిందని, ఇందులో ఇరు దేశాలేకాక రెండు కోట్ల మంది ప్రజల మనోభావాలు ఇమిడి ఉన్నాయని షరీఫ్ లేఖలో పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి పాక్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు భారత్ సహకరించటంలేదని, కశ్మీర్ అంశంపై మాట్లాడేందుకు సిద్ధంగా లేని కారణంగానే ఎన్ఎస్ఏ స్థాయి చర్చల్లో భారత్ వెనుకడుగువేసిందని ఆరోపించారు. ఇస్లామాబాద్- ఢిల్లీల మధ్య మైత్రి కొనసాగాలన్నదే తమ అభిమతమని తెలిపారు. గిలానీ కూడా పాక్ ఆహ్వానానికి అంగీకరించారని, అతి త్వరలోనే పర్యటనకు సంబంధించిన తేదీల వివరాలు తెలియజేస్తామని అధికార ప్రతినిధి తెలిపారు. -
వేర్పాటువాద నేతకు పాస్‌పోర్ట్
శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీకి ప్రభుత్వం పాస్ పోర్ట్ మంజూరు చేసింది. 9 నెలల కాల వ్యవధితో ఆయనకు పాస్ పోర్టు లభించింది. దాయాది దేశంతో సంబంధాల విషయంలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గిలానీకి పాస్ పోర్ట్ మంజూరు కావడం చర్చనీయాంశమైంది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, పాక్ పట్ల సానుకూల దృక్పథం వ్యక్తం చేయడం ఆయనకు అలవాటన్న సంగతి తెలిసిందే. నేను పుట్టుకతో భారతీయుడిని కాదని, పాస్ పోర్టు కోసం మాత్రమే అలా చెప్పుకోవాల్సి వస్తుందని గిలానీ గతంలో అన్నారు. కాగా, కూతురును చూసేందుకు విదేశాలకు వెళ్లాలని తనకు పాస్ పోర్ట్ మంజూరు చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల వివాదానికి ప్రభుత్వం తెరదించింది. గిలానీ దరఖాస్తు నిబంధనల మేరకు ఉన్నందువల్లే ఆయనకు పాస్ పోర్టు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. -
ఐఎస్ జెండాలతో ఎంత నష్టమో ఆలోచించారా?
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఐఎస్ఐఎస్ సంస్థ జెండాలు ఎగురవేయడంపై వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా గిలానీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కశ్మీర్ లో జరుగుతున్న పోరాటంలో ఐఎస్ లాంటి సంస్థల ప్రమేయం అవసరమే లేదన్నారు. శుక్రవారం శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో కొందరు యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగురవేశారు. గడిచిన కొద్ది నెలలుగా కశ్మీర్ లోయలో పాక్ జెండాలు ఎగరడం పరిపాటిగా మారినప్పటికీ మొదటిసారి ఐఎస్ జెండాలు కనిపించడంతో సర్వత్రా ఆశ్చర్యాగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి చర్యలు కశ్మీర్ విముక్తి పోరాటాన్ని నీరుగార్చుతాయని, జెండాలు పట్టుకున్న యువకులు ఈ చర్య ఎంత నష్టం కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సిందని గిలానీ అన్నారు. 'ఇప్పటికే మా అస్థిత్వపోరాటాన్ని ఉగ్రవాదంగా చూపుతోన్న భారత ప్రభుత్వం.. దీనిని అవకాశంగా మలుచుకుంటుందని, అంతర్జాతీయ వేదికలపై మమల్ని ఏకాకిగా నిలబెట్టే అవకాశం ఉంది' అని వ్యాఖ్యానించారు. -
'పుట్టుకతో భారతీయుడిని కాదు..కానీ'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ఐరిష్ తదితర వివరాలను సమర్పించారు. కుమార్తెను చూసేందుకు ఆయన సౌదీ అరేబియా వెళ్లదలచుకున్నారు. అందు నిమిత్తం ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లకోసం పాస్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్లారు. జాతీయత అనే ఆప్షన్లో గిలానీ ఇండియన్ అని టిక్ పెట్టారని పాస్ పోర్ట్ ఆఫీస్ అధికారి తెలిపారు. 'పుట్టుకతో నేను భారతీయుడిని కాదు..కానీ తప్పడం లేదు, బలవంతంగా అయ్యాను' అని గిలానీ అన్నారు. కశ్మీర్ కు చెందిన ప్రతిఒక్కరూ విదేశాలకు వెళ్లాలంటే ఇండియన్ పాస్ పోర్టుతోనే వెళ్లాక తప్పదని గిలానీ పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ నేత గిలానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదాలకు దారితీశాయి. భారతీయుడినని గిలానీ ఒప్పుకోవాలని, జాతీయతను వ్యతిరేకించే కార్యకలాపాలను చేపట్టినందున క్షమాపణ కోరాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదిలాఉండగా, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఓమర్ అబ్దుల్లా మాత్రం పాస్ పోర్టు ఇవ్వడం అనేది సమస్యే కాదంటూ గిలానీకి మద్ధతు పలికారు. గతంలో ఆయనకు ఎన్నోసార్లు ఈ సౌకర్యాన్ని కల్పించార్న విషయాన్ని గుర్తుచేశారు. -
వేర్పాటువాదులపై కేంద్రం ఫైర్
గిలానీ ర్యాలీలో పాక్ నినాదాలపై సీరియస్ కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశం గిలానీ, ఆలం హౌస్ అరెస్ట్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ నిర్వహించిన ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యతిరేక చర్యల్లో పాల్గొన్న వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆ రాష్ర్ట సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌తో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. జాతీయ భద్రత విషయంలో ఏ విధంగానూ రాజీ పడకూడదని సూచించారు. ఐదేళ్ల తర్వాత రాష్ర్టంలో ర్యాలీ నిర్వహించేందుకు గిలానీకి అవకాశమిచ్చినట్లు సయీద్ వివరించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన వేర్పాటువాద నేత మసరత్ ఆలం ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ర్యాలీ సందర్భంగా పాక్‌కు అనుకూలంగా ఆలం నినాదాలు చేయగా, మరికొందరు ఆ దేశ జెండాలను ప్రదర్శించారు. కాగా, దీనిపై జమ్మూలో గురువారం నిరసనలు వ్యక్తమయ్యాయి. వేర్పాటువాద నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ క్రాంతి దళ్, హిందూ శివసేన, మరో సంస్థతో పాటు కశ్మీరీ పండిట్లు నిరసనలు చేపట్టారు. కాగా, పాక్ జెండాలు ఎగరేయడం తనకు తప్పుగా కనిపించడం లేదని ఆలం అన్నారు. జాతి విద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ పేర్కొంది. ఇలాంటి ఘటనలను సహించబోమని సీఎం సయీద్ పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో గిలానీ, ఆలం, మరో వేర్పాటువాద నేతలపై కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం త్రాల్లో ర్యాలీ నిర్వహిం చనున్న నేపథ్యంలో ఆలం, గిలానీలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. -
గిలానీని కలిసేందుకు మోడీ ఎవరినీ పంపలేదు
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తరపున రాయబారులు కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మెన్ సయ్యద్ అలీషా గిలానీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారనే మీడియా కథనాలను బీజేపీ ఖండించింది. గిలానీని కలిసేందుకు మోడీ ఎవరినీ పంపలేదని ఆ పార్టీ శనివారం స్పష్టం చేసింది. భారత్‌లో కాశ్మీర్ అంతర్బాగమేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే గిలానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇటువంటి ప్రయత్నాలు మానుకుని గిలానీ ప్రజలకు క్షమాపక్ష చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు మోడీ తరపున ఇద్దరు కాశ్మీరీ పండిట్లు తనను కలిశారని గిలానీ తెలిపారు. మార్చి 22న ఢిల్లీలో తనతో కాశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు మోడీ తరపున వచ్చినట్లు వారు చెప్పారని ఆయన వెల్లడించారు. అయితే కాశ్మీరీ పండిట్లుగా దీనిపై ఎవరితోనైనా మాట్లాడే హక్కు వారికుందని చెప్పానన్నారు. మోడీకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటంతో తాను వారి విజ్ఞప్తిని తిరస్కరించానని గిలానీ వెల్లడించారు. అయితే దీనిపై బిజెపి మండిపడింది. గిలానీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై రాజకీయ పక్షాలు బిజెపిపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నాయి. -
కాశ్మీర్‌లోయలో బంద్ ప్రశాంతం
హురియత్ కాన్ఫరేన్స్ పిలుపు మేరకు కాశ్మీర్ వ్యాలీలో శనివారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని తెలిపారు. వ్యాలీలో పలు పట్టణాల్లో ముందస్తుగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా భద్రత సిబ్బందిని మోహరించామని తెలిపారు. దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూసివేశారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వేర్పాటువాదులు గిలానీ, ఉమర్ ఫరూఖ్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసీన్ మాలిక్‌లను పోలీసులు గృహ నిర్బంధించారు. షోపియాన్ పట్టణంలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించడం పట్ల శుక్రవారం వేర్పాటువాదులు ఆ పట్టణంలో ర్యాలీ నిర్వహించాలని భావించారు. అందులోభాగంగా వారిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకుని గృహ నిర్భంధంలో ఉంచింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ వ్యాలీలో శనివారం బంద్‌కు హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సయ్యద్ అలీ షా జిలానీ పిలుపు నిచ్చారు. షోపియాన్ పట్టణంలో విధించిన కర్ఫ్యూ 9వ రోజుకు చేరుకుంది.