గిలానీని కలిసేందుకు మోడీ ఎవరినీ పంపలేదు
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తరపున రాయబారులు కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మెన్ సయ్యద్ అలీషా గిలానీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారనే మీడియా కథనాలను బీజేపీ ఖండించింది. గిలానీని కలిసేందుకు మోడీ ఎవరినీ పంపలేదని ఆ పార్టీ శనివారం స్పష్టం చేసింది. భారత్లో కాశ్మీర్ అంతర్బాగమేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే గిలానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇటువంటి ప్రయత్నాలు మానుకుని గిలానీ ప్రజలకు క్షమాపక్ష చెప్పాలని డిమాండ్ చేసింది.
మరోవైపు మోడీ తరపున ఇద్దరు కాశ్మీరీ పండిట్లు తనను కలిశారని గిలానీ తెలిపారు. మార్చి 22న ఢిల్లీలో తనతో కాశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు మోడీ తరపున వచ్చినట్లు వారు చెప్పారని ఆయన వెల్లడించారు. అయితే కాశ్మీరీ పండిట్లుగా దీనిపై ఎవరితోనైనా మాట్లాడే హక్కు వారికుందని చెప్పానన్నారు. మోడీకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటంతో తాను వారి విజ్ఞప్తిని తిరస్కరించానని గిలానీ వెల్లడించారు. అయితే దీనిపై బిజెపి మండిపడింది. గిలానీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై రాజకీయ పక్షాలు బిజెపిపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నాయి.