గిలానీ.. ఓ సారి మా ఊరికిరా..
- కశ్మీర్ వేర్పాటువాదనేత గిలానీకి నవాజ్ షరీఫ్ ప్రత్యేక లేఖ
- పాకిస్థాన్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం
న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ మరోసారి భారత్ ను రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇదే అంశంపై ఇరుదేశాలు భిన్నవాణులను వినిపించిన దరిమిలా చర్చల ప్రక్రియ ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. పాకిస్థాన్ పర్యటనకు రావాల్సిందిగా హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీషా గిలానీకి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం పంపడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు నవాజ్ పంపిన ఆహ్వాన పత్రాన్ని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్.. గిలానీకి అందజేశారు.
'శుక్రవారం రాత్రి జరిగిన విందు సమావేశంలో బాసిత్.. నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వానాన్ని గిలానీకి అందజేశారు' అని పాక్ కమిషనర్ కార్యాలయ అధికార ప్రతినిధి ఒకరు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా లేఖలోని అంశాలను ఆయన ఉటంకించారు. కశ్మీర్ అంశం కారణంగా పార్ ఏర్పాటు ప్రక్రియ అసంపూర్ణంగా మిగిలిపోయిందని, ఇందులో ఇరు దేశాలేకాక రెండు కోట్ల మంది ప్రజల మనోభావాలు ఇమిడి ఉన్నాయని షరీఫ్ లేఖలో పేర్కొన్నారు.
సమస్య పరిష్కారానికి పాక్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు భారత్ సహకరించటంలేదని, కశ్మీర్ అంశంపై మాట్లాడేందుకు సిద్ధంగా లేని కారణంగానే ఎన్ఎస్ఏ స్థాయి చర్చల్లో భారత్ వెనుకడుగువేసిందని ఆరోపించారు. ఇస్లామాబాద్- ఢిల్లీల మధ్య మైత్రి కొనసాగాలన్నదే తమ అభిమతమని తెలిపారు. గిలానీ కూడా పాక్ ఆహ్వానానికి అంగీకరించారని, అతి త్వరలోనే పర్యటనకు సంబంధించిన తేదీల వివరాలు తెలియజేస్తామని అధికార ప్రతినిధి తెలిపారు.