'పుట్టుకతో భారతీయుడిని కాదు..కానీ'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ తాను భారతీయుడిని అని ధృవీకరించారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన ఆప్లికేషన్ ఫారమ్ లో తాను భారతీయుడినని పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ అక్కడి కార్యాలయంలో బయోమెట్రిక్ డాటా అయిన వేలి ముద్రలు, ఐరిష్ తదితర వివరాలను సమర్పించారు. కుమార్తెను చూసేందుకు ఆయన సౌదీ అరేబియా వెళ్లదలచుకున్నారు. అందు నిమిత్తం ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లకోసం పాస్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్లారు. జాతీయత అనే ఆప్షన్లో గిలానీ ఇండియన్ అని టిక్ పెట్టారని పాస్ పోర్ట్ ఆఫీస్ అధికారి తెలిపారు.
'పుట్టుకతో నేను భారతీయుడిని కాదు..కానీ తప్పడం లేదు, బలవంతంగా అయ్యాను' అని గిలానీ అన్నారు. కశ్మీర్ కు చెందిన ప్రతిఒక్కరూ విదేశాలకు వెళ్లాలంటే ఇండియన్ పాస్ పోర్టుతోనే వెళ్లాక తప్పదని గిలానీ పేర్కొన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ నేత గిలానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదాలకు దారితీశాయి. భారతీయుడినని గిలానీ ఒప్పుకోవాలని, జాతీయతను వ్యతిరేకించే కార్యకలాపాలను చేపట్టినందున క్షమాపణ కోరాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదిలాఉండగా, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఓమర్ అబ్దుల్లా మాత్రం పాస్ పోర్టు ఇవ్వడం అనేది సమస్యే కాదంటూ గిలానీకి మద్ధతు పలికారు. గతంలో ఆయనకు ఎన్నోసార్లు ఈ సౌకర్యాన్ని కల్పించార్న విషయాన్ని గుర్తుచేశారు.