శ్రీనగర్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ జెండాలను ప్రదర్శిస్తున్న యువకులు (ఫైల్), ఇన్సెట్లో సయ్యద్ అలీషా గిలానీ
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఐఎస్ఐఎస్ సంస్థ జెండాలు ఎగురవేయడంపై వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీ షా గిలానీ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కశ్మీర్ లో జరుగుతున్న పోరాటంలో ఐఎస్ లాంటి సంస్థల ప్రమేయం అవసరమే లేదన్నారు.
శుక్రవారం శ్రీనగర్లోని ఓ మసీదు వద్ద భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో కొందరు యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగురవేశారు. గడిచిన కొద్ది నెలలుగా కశ్మీర్ లోయలో పాక్ జెండాలు ఎగరడం పరిపాటిగా మారినప్పటికీ మొదటిసారి ఐఎస్ జెండాలు కనిపించడంతో సర్వత్రా ఆశ్చర్యాగ్రహాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి చర్యలు కశ్మీర్ విముక్తి పోరాటాన్ని నీరుగార్చుతాయని, జెండాలు పట్టుకున్న యువకులు ఈ చర్య ఎంత నష్టం కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించి ఉండాల్సిందని గిలానీ అన్నారు. 'ఇప్పటికే మా అస్థిత్వపోరాటాన్ని ఉగ్రవాదంగా చూపుతోన్న భారత ప్రభుత్వం.. దీనిని అవకాశంగా మలుచుకుంటుందని, అంతర్జాతీయ వేదికలపై మమల్ని ఏకాకిగా నిలబెట్టే అవకాశం ఉంది' అని వ్యాఖ్యానించారు.