హురియత్ కాన్ఫరేన్స్ పిలుపు మేరకు కాశ్మీర్ వ్యాలీలో శనివారం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని తెలిపారు. వ్యాలీలో పలు పట్టణాల్లో ముందస్తుగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా భద్రత సిబ్బందిని మోహరించామని తెలిపారు. దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూసివేశారు.
రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వేర్పాటువాదులు గిలానీ, ఉమర్ ఫరూఖ్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసీన్ మాలిక్లను పోలీసులు గృహ నిర్బంధించారు. షోపియాన్ పట్టణంలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించడం పట్ల శుక్రవారం వేర్పాటువాదులు ఆ పట్టణంలో ర్యాలీ నిర్వహించాలని భావించారు. అందులోభాగంగా వారిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకుని గృహ నిర్భంధంలో ఉంచింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ వ్యాలీలో శనివారం బంద్కు హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సయ్యద్ అలీ షా జిలానీ పిలుపు నిచ్చారు. షోపియాన్ పట్టణంలో విధించిన కర్ఫ్యూ 9వ రోజుకు చేరుకుంది.